‘రిజిస్ట్రేషన్‌’లో నయాదందా | ACB Raids at Warangal Sub-Registrar Office | Sakshi
Sakshi News home page

‘రిజిస్ట్రేషన్‌’లో నయాదందా

Apr 4 2026 5:06 AM | Updated on Apr 4 2026 5:06 AM

ACB Raids at Warangal Sub-Registrar Office

సబ్‌ రిజిస్ట్రార్‌ ఇంటిలో తనిఖీలు.. స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలు

వాట్సాప్‌ చాట్‌ ద్వారా సంకేతాలు

డాక్యుమెంట్‌ రైటర్‌లే మధ్యవర్తులు

ఏడాదిలో రూ.42 లక్షల మేర ఫోన్‌ పే లావాదేవీలు.. ఏసీబీ సోదాలలో బట్టబయలు 

సాక్షిప్రతినిధి, వరంగల్‌: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో  అవినీతి, అక్రమాలపర్వం కొనసాగుతూనే ఉంది. వరంగల్‌లో ట్రెండ్‌ మార్చిన ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు ఏకంగా వాట్సాప్‌ కాల్, చాటింగ్‌ల ద్వారా కథ నడిపించిన వైనం ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. అక్రమ వెంచర్లు, ప్రభుత్వ, అసైన్డు భూములు.. ఇలా ఒక్కో భూమి రిజిస్ట్రేషన్‌కు ఒక్కోరేటు మాట్లాడుకుని అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదుల మేరకు గురు, శుక్రవారం ఏసీబీ చేపట్టిన తనిఖీలతో గుట్టురట్టయ్యింది. ఏసీబీ వరంగల్‌ రేంజ్‌ డీఎస్‌పీ సాంబయ్య కథనం ప్రకారం..  మొదట వడ్డెపల్లిలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలోని సబ్‌ రిజిస్ట్రార్ 1, 2 చాంబర్‌లలో తనిఖీలు చేశారు.

సోదాల సమయంలో కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు/డాక్యుమెంట్‌ రైటర్‌లు ఉండగా, లెక్కకు చూపని రూ.47,450 నగదుతో పాటు 70 నమోదుకాని పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. డాక్యుమెంట్‌ రైటర్‌ మొబైల్‌ ఫోన్‌లను తనిఖీ చేయగా సబ్‌ రిజిస్ట్రార్–1 జమాలపురం రామనరసింహారావు, సబ్‌ రిజిస్ట్రార్–2 దావులూరి ఆనంద్‌ల మధ్య జరిగిన అనేక వాట్సాప్‌ చాట్‌లు బయటపడ్డాయి.

గత సంవత్సర కాలంలో పత్రాలు రాసిన వారితో సుమారు రూ.42,03,125ల విలువైన ఫోన్‌పే లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. శుక్రవారం ఏకకాలంలో సబ్‌రిజిస్ట్రార్‌ల ఇళ్లలో సోదాలు జరిపినట్లు డీఎస్‌పీ సాంబయ్య తెలిపారు. ఈ సందర్భంగా సబ్‌రిజిస్ట్రార్‌ దావులూరి ఆనంద్‌ నుంచి రూ.24,61,540ల నికర నగదు, 819.500 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.600 కిలోగ్రాముల వెండి ఆభరణాలు, కపిల్‌ చిట్స్‌లో రూ.30,10,000లు విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు స్వా«దీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement