ఖమ్మం మెడికో విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలు!

Suspicions On Khammam Medical Student Manasa Suicide - Sakshi

సాక్షి, ఖమ్మం:  మెడీకో విద్యార్థిని మానస మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం నగరంలోని మమత మెడికల్ కాలేజ్‌లో బీడీఎస్ నాలుగవ సంవత్సరం చదువుతున్న మానస ఆదివారం బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. హాస్టల్‌ గదిలో లోపల గడి పెట్టుకొని ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకుంది. 80శాతం గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. 

మహబూబాబాద్‌ కేసముద్రానికి చెందిన మానస.. మానసిక ఒత్తిడి కుటుంబ పరిస్థితుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యవక్తమవుతున్నాయి.  ఆమెకు అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి కొన్ని బ్యాక్‌లాగ్‌లున్నట్లు సమాచారం. మరోవైపు మెడికో ఆత్మహత్యపై లోతైన విచారణ చేపట్టకుండా పోలీసులు  ఆగమేఘాలపై మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చేతులు దులిపేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సంబంధిత వార్త: ఖమ్మంలో మెడికో ఆత్మహత్య..

హాస్టల్‌ నిర్వాహకులు, సహచర విద్యార్థుల నుంచి వివరాలేమీ సేకరించకుండా హడావుడిగా వెళ్లిపోవడం చర్చనీయాంశమయ్యింది. మీడియాకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో మానస మృతికి దారితీసిన కారణాలపై కనీస స్పష్టత కొరవడింది. అదే విధంగా ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి మీడియాను అనుమతించొద్దని పోలీసులు చెప్పారంటూ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన విలేకరులను హాస్టల్‌ నిర్వాహకులు గేటు బయటే అడ్డుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.

ఖమ్మం అర్బన్‌ సీఐ శ్రీహరిని వివరణ కోరగా.. తమ ఎస్సైలు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారని తెలిపారు. మానస కుటుంబ సభ్యులు వస్తే తప్ప ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదని చెప్పారు. హాస్టల్‌ నిర్వాహకులే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అయితే ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు వారు ఖమ్మం చేరుకోలేదు. కాగా సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి బాటిల్‌లో పెట్రోల్ తెచ్చుకున్న మానస.. మానసిక ఒత్తిళ్లతోనే బలవన్మరణం చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
చదవండి: అసమ్మతి నేతల ‘అల్టిమేటం’.. ‘బండి’ని ఢిల్లీ పిలిపించిన అధిష్టానం? 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top