కాళేశ్వరం జలాలకు లక్ష జన హారతి 

Lakh Jana Haarti to the waters of Kaleshwaram - Sakshi

వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ ఇంటర్నేషనల్‌లో చోటు 

మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ప్రతిష్టాత్మక కార్యక్రమం 

మూడు నియోజకవర్గాలు, 68 కిలోమీటర్ల కాలువ పొడవునా జన హారతి 

పాల్గొన్న ఆరు మండలాలు, 126 గ్రామాలకు చెందిన 1,16,142 మంది ప్రజలు 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాళేశ్వరం జలాలకు ఇచ్చిన లక్ష జన హారతి.. వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇంటర్నేషనల్‌లో చోటు దక్కించుకుంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సూర్యాపేట జిల్లాలోని నాగారం మండలం ఈటూరు నుంచి పెన్‌పహాడ్‌ మండలం చీదెళ్ల చెరువు వరకు 68 కిలో మీటర్ల పొడవున, 126 గ్రామాల పరిధిలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రెండో దశ డీబీఎం–71 కాలువ ద్వారా ప్రవహించే గోదావరి జలాలకు లక్ష హారతి కార్యక్రమం నిర్వహించారు.

చివ్వెంల మండలం కాలువ వద్ద నిర్వహించిన సంబరాల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కు చెందిన ఐడబ్ల్యూఎస్‌ఆర్‌ చీఫ్‌ డాక్టర్‌ బి.నరేందర్‌గౌడ్, తెలంగాణ కోఆర్డినేటర్‌ గంగాధర్‌. మెడల్, మెమెంటో, ప్రశంసాపత్రాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డికి అందజేశారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు చివ్వెంల వద్ద, జాజిరెడ్డిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం వద్ద తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కు మెమెంటోలు అందజేశారు.
 
లక్ష అనుకుంటే అంతకు మించి జనం 
మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరు మండలాలకు చెందిన 126 గ్రామాల్లో వండర్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ ప్రతినిధుల బృందం పర్యటించింది. కాళేశ్వరం జలాలకు లక్ష మందితో జన హారతి అనుకున్నప్పటికి కార్యక్రమంలో 1,16,142 మంది పాల్గొన్నట్లు బృందం నిర్ధారించింది. ఇందులో 65,042 మంది మహిళలు, 51,100 మంది పురుషులు పాల్గొన్నట్లు వెల్లడించింది. 

107 వీడియో కెమెరాలు, 8 డ్రోన్లతో చిత్రీకరణ 
వండర్‌ బుక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన మూడు బృందాల నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు 107 వీడియో కెమెరాలు, 8 డ్రోన్లను వినియోగించారు. 62 కళా బృందాలు, 126 చోట్ల డప్పు మేళాలు, 54 బతుకమ్మ బృందాలు ఇందులో పాల్గొన్నాయి. కాలువ పొడవునా లక్ష మందికీ భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు సన్మానించారు. 

కేసీఆర్‌తోనే సాధ్యమైంది: మంత్రి జగదీశ్‌రెడ్డి 
విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్‌ సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలలో పర్యటించినప్పుడు.. ఈ ప్రాంతానికి నీరు అందాలి అంటే గోదావరి జలాలే శరణ్యం అని భావించారని గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి అయిన తర్వాత మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. కేసీఆర్‌ కృషితోనే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు నీళ్లు పారుతున్నాయన్నారు. అందుకు సీఎంకి కృతజ్ఞత చెప్పుకునేందుకు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నీటిపారుదల దినోత్సవం రోజున ఈ ప్రాంత రైతాంగం కాళేశ్వరం జలానికి లక్ష జన హారతి నిర్వహించామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top