అన్నాడీఎంకేను చీల్చడం నా ఉద్దేశం కాదు..! | - | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకేను చీల్చడం నా ఉద్దేశం కాదు..!

May 31 2026 1:54 AM | Updated on May 31 2026 1:54 AM

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే లోని అగ్రనాయకత్వం మధ్య విభేదాలు తొలగిపోయి, పార్టీ మళ్లీ ఏకం కావడంపై లాల్‌గుడి నియోజకవర్గ ఎమ్మెల్యే లీమా రోస్‌ మార్టిన్‌ హర్షం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న రాజకీయ ఆరోపణలను, పుకార్లను ఆమె తీవ్రంగా ఖండించారు. కొందరు కావాలనే తన ప్రతిష్టకు భంగం కలిగించడానికి అసత్య ప్రచారాలు చేశారని, తాజా విలీనంతో ఆ కట్టుకథలకు తెరపడిందని శనివారం ప్రకటించారు. అన్నాడీఎంకేలో ఎమ్మెల్యే తిరుగుబాటు గురించి తెలిసిందే. టీవీకేలో కీలక నేతగా ఉన్న ఆధవ్‌ అర్జునకు లీమారోస్‌ అత్యంత సమీప బంధువు కావడంతో కొత్త చర్చ ఊపందుకుంది. అన్నాడీఎంకేను, ఎమ్మెల్యేలను చీల్చడంలో లీమా రోస్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి.

ఆ కట్టుకథలన్నీ అబద్ధాలని తేలిపోయింది:

తనపై జరిగిన ప్రచారాల గురించి లీమా రోస్‌ తన స్పందించారు. ‘పురట్చి తలైవర్‌ ఎంజీఆర్‌ స్థాపించి, అమ్మ జయలలిత పెంచి పోషించిన ఈ మహోన్నతమైన పార్టీలో చీలికలు తీసుకురావాలని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. గత కొంతకాలంగా కొందరు తన పేరును వాడుకుంటూ ఎలాంటి ఆధారాలు లేని కట్టుకథలను ప్రచారం చేశారని మండి పడ్డారు. తనపై నాపై బురద జల్లాలనే ఉద్దేశంతోనే వారు అలా చేశారన్నది స్పష్టం అవుతోందన్నారు. అయితే, ఇప్పుడు పార్టీ నేతలందరూ ఒకతాటిపైకి రావడంతో ఆ వదంతులన్నీ పూర్తిగా పటాపంచలయ్యాయని తెలిపారు. లాల్‌గుడి అభివృద్ధే మొదటి కర్తవ్యమని,

కోట్లాది మంది ప్రజల నమ్మకానికి చిహ్నమైన రెండాకుల గుర్తుపై పోటీ చేసి, లాల్‌గుడి నియోజకవర్గ శాసనసభ్యురాలిగా ఎన్నికవ్వడాన్ని తన జీవితంలోనే అతిపెద్ద గౌరవంగా భావిస్తున్నట్లు లీమా రోస్‌ పేర్కొన్నారు. తమిళనాడులో మళ్లీదివంగత అమ్మ జయలలిత సుపరిపాలనను తీసుకురావడానికి అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో తామంతా అహర్నిషలు శ్రమిస్తామని స్పష్టంచేశారు. నాయకుల ఏకంతో అన్నాడీఎంకే శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొందన్నారు. ఇదిలా ఉండగా అలిగిన సీనియర్‌ నేత సీవీ షణ్ముగం సైతం పళనిస్వామితో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు అనుగుణంగా విల్లుపురం జిల్లా అన్నాడీఎంకే కార్యాలయం తాళాలను పళణిస్వామి శిబిరానికిఅ ందజేయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement