తమిళసినిమా: కోలీవుడ్లో నటుడిగా బిజీగా ఉన్న దర్శకుడు సెల్వరాఘవన్. చిత్రాల్లో ప్రధాన పాత్రలనే కాకుండా కథానాయకుడిగాను నటిస్తున్నారు. అలా ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మనిదన్ దైవమాగలామ్. ఖుషిరవి నాయకిగా నటించిన ఇందులో వైజీ. మహేంద్రన్, మైమ్ గోపి, కౌసల్య, సతీష్, విర్తిక, ఎన్.జ్యోతి కన్నన్ ముఖ్యపాత్రలు పోషించారు. వ్యోమ్ ఎంటర్ టెయిన్‌మెంట్ పతాకంపై విజయ సతీష్ నిర్మించిన ఈ చిత్రానికి డెన్నీస్ మంజునాథ్ దర్శకత్వం వహించారు. రవివర్మ చాయాగ్రహణం, ఏకే ప్రియన్ సంగీతాన్ని అందించారు. ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఈచిత్రం ఈనెల 10న తెరపైకి రానుంది. చిత్ర టీజర్ ,రెండు పాటలు ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆదరణను పొందాయని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సెల్వరాఘవన్ మాట్లాడుతూ ఈ చిత్రానికి సాంకేతిక వర్గం ఎంతో కఠినంగా శ్రమించారన్నారు. వాళ్లను చూసి ఇలా కూడా చిత్రాన్ని చేయొచ్చని తాను నేర్చుకున్నానన్నారు. ఒకప్పుడు కౌశల్యను చూసి ఆమెకి అభిమానిని అయ్యానని అన్నారు. అలాంటిది ఇప్పుడు ఆమెతో కలసి ఈ వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందనో సెల్వరాఘవన్ పేర్కొన్నారు.


