– ఎం.ఎస్. ధోని పిలుపు
సాక్షి, చైన్నె: భారత క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్.ధోని హెల్త్‌కేర్ సంస్థ మెరిల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ‘ట్రీట్‌మెంట్ జరూరీ హై’ (చికిత్స అవసరం) ఉద్యమంలో భాగంగా ‘బచ్‌పనా షుడంట్ రిటైర్’ (బాల్యం రిటైర్ అవ్వకూడదు) అనే నూతన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వయసు పెరిగినా మనసులోని ఉత్సాహం, కుతూహలం తగ్గకూడదనే ఉద్దేశంతో ఈ ప్రచారాన్ని రూపొందించారు. ముఖ్యంగా వృద్ధులలో వచ్చే గుండె సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు (ఆర్థోపెడిక్) వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా వారి జీవన నాణ్యతను మెరుగుపరచవచ్చని ఈ కార్యక్రమం చాటిచెబుతోంది. ధోని మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది మన కోసం మాత్రమే కాదు, మనల్ని ప్రేమించే వారి కోసం కూడా చాలా ముఖ్యం అని సూచించారు. ముఖ్యంగా నేటి యువత తల్లిదండ్రులు, తాతయ్య–నానమ్మల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వారికి అవసరమైన సంరక్షణ, మద్దతు అందించడం మన బాధ్యత అని పిలుపునిచ్చారు.


