23న కోర్టుల మూసివేత
కొరుక్కుపేట: రాష్ట్రంలో ఈనెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు సహా తమిళనాడు వ్యాప్తంగా ఉన్న కోర్టులన్నీ మూసివేస్తారని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.అల్లి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23వ తేదీన జరగనున్నాయి. ఆ రోజున కోర్టులన్ని మూసివేస్తామని, అదేవిధంగా, ఏప్రిల్ 9న పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున, ఆరోజు పుదుచ్చేరిలోని వారపు సమావేశాలకు సెలవు ప్రకటించనున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.
హొసూర్‌లో
ఐనాక్స్ అత్యాధునిక ప్లాంట్
సాక్షి,చైన్నె: పారిశ్రామిక, వైద్య గ్యాస్ తయారీ రంగంలో దూసుకెళ్తున్న ఐనాక్స్ ఎయిర్ ప్రోడక్ట్స్ తమిళనాడులోని హొసూర్‌లో మొట్టమొదటి అల్ట్రా–హై ప్యూరిటీ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ విజయవంతంగా ఉత్పత్తి ప్రారంభించారు. దేశీయంగా సెమీకండక్టర్, సోలార్ సెల్ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలకంగా ఉంటుందని ప్రకటించారు. ఈ ప్లాంట్ 6 ఎన్ గ్రేడ్ కలిగిన లిక్విడ్ ఆక్సిజన్‌న్‌ను ఉత్పత్తి చేస్తుందని, సెమీకండక్టర్ చిప్స్, సోలార్ ప్యానెల్స్ తయారీలో కచ్చితత్వంతో కూడిన ఈగ్యాస్ ఎంతో కీలకంగా ఉంటుందని వివరించారు. రోజుకు 17 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నట్టు, ఈ సందర్భంగా ఐనాక్స్ ఎయిర్ ప్రోడెక్ట్స్ ఎండీ సిద్ధార్థ్ జైన్ వివరించారు. ఆయన మాట్లాడుతూ, భారతదేశ భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాన్ని దేశీయంగానే నిర్మించడం తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ద్వారా సెమీకండక్టర్, సోలార్ రంగాల్లో దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి, ఆత్మనిర్బర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
స్నేహితుడి ఇంటిపైనే
పెట్రోల్ బాంబు విసిరాడు!
తిరువొత్తియూరు: స్నేహితుడి ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరాడో యువకుడు. తిరువణ్ణామలై కి చెందిన బాబు, యువరాజ్ స్నేహితులు ఇద్ద రూ ఐనావరం, సోలై యమ్మన్ కోవిల్ వీధిలోని గుడిసె ఇంట్లో ఉంటూ బిల్డింగ్ పనులు చేస్తు న్నారు. గురువారం రాత్రి బాబుకు, యువరాజ్‌కు మధ్య గొడవ తలెత్తి ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువరాజ్ తిరిగి రాలేదు. ఇంటికి తాళం వేసి బాబు ఒక్కడే పడుకున్నాడు.ఈ నేపథ్యంలో అర్ధరాత్రి అనంతరం 2 గంటల సమయంలో అక్కడికి వచ్చిన యువరాజ్ హఠాత్తుగా బా బు ఉంటున్న గుడిసె ఇంటిపై పెట్రోల్ బాంబు విసరడంతో అది పెద్ద శబ్దంతో పేలిఇంటికి మంటలు అంటుకున్నాయి. ఇది చూసి బాబు ఇరుగుపొరుగు వారి సహాయంతో మంటలు ఆర్పి వేశాడు. ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.
చైన్నె పోలీస్ కమిషనర్
కార్యాలయంలో అగ్నిప్రమాదం
కొరుక్కుపేట: చైన్నె పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కమిషనరేట్‌లో 8 అంతస్తుల భవనంలోని 2వ అంతస్తులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డాక్యుమెంట్ ఫోర్జరీ యూనిట్ పనిచేస్తోంది.శుక్రవారం ఉదయం దాదాపు 7 గంటలకు ఈ కార్యాలయం నుంచి పొగలు వస్తుండడటం అధికారులు గమనించారు. అగ్నిమాపక విభాగానికి సమాచారమిచ్చి, తమ ఆయుధాలతో అక్కడి నుంచి వెలుపలికి పరుగులు తీశారు. తర్వాత వేపెరి ప్రాంతం నుంచి హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను ఆర్పివేశారు. మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించకుండా నివారించారు. అయితే, అప్పటికే కార్యాలయంలోని కంప్యూటర్, రిఫ్రిజిరేటర్లు, డెస్క్ టాప్, ఇతర వస్తువులు కూలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో గుర్తించారు.
ఆవు తెచ్చిన ఉపద్రవం!
తిరువొత్తియూరు: మాధవరం సమీపం మంజంబాక్కం టోల్ ప్లాజా వద్ద ద్విచక్ర వాహనంపై వస్తున్న దంపతులను ఆవు ఢీకొనడంతో కిందపడిన భర్త తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎన్నూరు, అన్నా శివగామి నగర్‌కు చెందిన అరుణగిరి (49) తన భార్య దేవితో కలిసి శుక్రవారం ఉదయం ఎన్నూరు నుంచి మాధవరానికి బైక్‌లో వెళుతుండగా మంజంబాక్కం టోల్ ప్లాజా వద్ద ఒక ఆవు భయపడి రోడ్డుపై అటూ ఇటూ పరిగెత్తింది. ఈ ఆవు వారు వెళ్తున్న బైక్‌ను ఢీకొనడంతో అదుపు తప్పి దంపతులిద్దరూ కిందపడ్డారు. అరుణగిరికి తలకు తీవ్రగాయమైంది. అతడిని అంబులెన్సులో స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇదే ప్రమాదంలో అతని భార్య దేవికి స్వల్ప గాయాలతో బైటపడింది. ఈ ప్రమాదంపై సెంగుండ్రం ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ ఇన్‌స్పెక్టర్ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


