సేలం: నామక్కల్ జిల్లా, తిరుచెంగోడ్ మున్సిపాలిటీ, ఏడవ వార్డు, సంగం కాలని, నార్త్ స్ట్రీట్‌లో 40కి పైగా ఇళ్లు ఉన్నాయి. ఇప్పటివరకూ ప్రాథమిక సౌకర్యాలు కల్పించలేదని నిరసిస్తూ తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఇంటింటా బ్యానర్లు ఏర్పాటు చేసి మరీ బాహాటంగా ఇలా చేయడంతో చర్చనీయాంశమైంది. స్థానికులు మాట్లాడుతూ, తమ ప్రాంతంలో పూర్తిస్థాయి మురుగునీటి పారుదల సౌకర్యం లేదని, మురుగునీరు నిలిచిపోవడం వల్ల పాములు, కీటకాల బెడద ఎక్కువగా ఉందని సమస్యలు ఏకరువు పెట్టారు. చాలామంది కూలీలపై ఆధారపడి జీవిస్తున్నామని, సమస్యలపై గత పదేళ్లుగా ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగం, నామక్కల్ జిల్లా కలెక్టర్, తిరుచెంగోడు మున్సిపల్ కమిషనర్ సహా అధికారులందరికీ వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నా ఇప్పటివరకు చర్యలు తీసుకున్న పాపానపోలేదని మండిపడ్డారు. వర్షాకాలంలో నిలిచిపోయిన మురుగునీటి కారణంగా ఇళ్లు దెబ్బతిని కూలిపోయాయని, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అనారోగ్యం బారిన పడిన వారిని ఆస్పత్రులకు కుర్చీలో మోసుకెళ్లాల్సి వస్తోందని గోడు వెళ్లగక్కారు. ఇన్ని సమస్యల నడుమ సతమతమవతున్నా తాము మున్సిపాలిటీకి క్రమం తప్పకుండా నీటి, ఇంటి పన్నులు చెల్లిస్తున్నామని, అయినా వసతులు కల్పించకపోవడం శోచనీయమని మండిపడ్డారు. విసిగి వేసారిని తాము రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయకుండా బహిష్కరించాలని తమ కుటుంబాలన్నీ నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ఇదే విషయమై ఎన్నికల సంఘం, రాష్ట్ర ముఖ్య అధికారులు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో సహా పలువురికి లేఖలు పంపినట్లు తెలిపారు.
ఇంటింటా కట్టిన బ్యానర్


