సాక్షి, చైన్నె : కార్యాలయాల్లో భద్రత, సమగ్రత, ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రముఖ సంస్థ సెక్యూర్ అస్ నేతృత్వంలో 5వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. చైన్నెలోని లీరాయల్ మెరిడియన్‌లో జరిగిన కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, హెచ్‌ఆర్ నిపుణులు హాజరయ్యారు.
ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా సీఎస్‌ఆర్ అండ్ ఇండియా ఫ్యాక్టరింగ్ ఫైనాన్స్ సొల్యూషన్స్ హెచ్‌ఆర్ హెడ్ గౌరీదాస్ హాజరై ప్రసంగించారు. సంస్థలు ఉద్యోగులకు కేవలం జీతాలు, బోనస్‌లు మాత్రమే ఇస్తాయని, అయితే, వారు పని కోసం చేసే త్యాగాలకు, పడే ఆవేదనకు డబ్బుతో వెలకట్టలేమన్నారు. అందుకే సంస్థలు తమ ఉద్యోగులపై మరింత బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొన్నారు. సెక్యూర్ అస్ వ్యవస్థాపకురాలు సీఈఓ విజి హరి మాట్లాడుతూ కార్యాలయాల్లో కేవలం నిబంధనలను పాటించడమే కాకుండా, భద్రత, గౌరవం అనేది ఒక సంస్క్కృతిగా మారాలని ఆకాంక్షించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలకు అవార్డులు అందజేశారు. సేఫ్ వర్క్ ప్లేస్ అవార్డు, ఈ క్లూజివ్ వర్క్ ప్లేస్ అవార్డు, హెల్తీ వర్క్ ప్లేస్ అవార్డు, ఎథికల్ వర్క్ ప్లేస్, హెచ్‌ఆర్ ఛాంపియన్ అవార్డులను అర్హులైన వారికి అందజేసి సత్కరించారు.


