తిరువొత్తియూర్: చైన్నెలోని కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఆలయంలో సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారిని విశేషంగా అలంకరించి కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించి తరించారు.
సాక్షి, చైన్నె: ఆధునిక సాంకేతికతతో మెజస్టర్ ఈవీ కారును సిద్ధం చేశామని ఎంజీ ఇండియా ప్రకటించింది. డీ ప్లస్ సెగ్మెంట్ ఎస్‌యూవీగా రూపుదిద్దుకున్న ఈ వాహనం మంచు కొండలలో సైతం అసాధారణ సామర్థ్యాన్ని నిరూపించిందని ఆ సంస్థ ప్రతినిధులు స్థానికంగా గురువారం ప్రకటించారు. అత్యంత గడ్డకట్టే చలిలో, క్లిష్టమైన దారుల్లో ఈ కారు దూసుకెళ్లడం వాహన ప్రేమకుల్ని విస్మయంలో పడేసిందన్నారు. మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద, 2 అడుగుల లోతు ఉన్న మంచు గడ్డలపై ఈ ఎస్‌యూవీ ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా ప్రయాణించిందని వివరించారు. సముద్ర మట్టానికి 13,668 అడుగుల ఎత్తులో ఉన్న ప్రసిద్ధ కీ గోంపా మఠాన్ని చేరుకోవడంతో పాటు, ఆసియాలోనే అత్యంత ఎత్తయిన చిచమ్ బ్రిడ్జ్‌ను కూడా విజయవంతంగా దాటిందన్నారు. ఈ కారులో ఉన్న క్రాల్ కంట్రోల్ మోడ్,ప్రత్యేకమైన స్నో మోడ్ మంచుపై పట్టు కోల్పోకుండా సురక్షితంగా ప్రయాణించేందుకు తోడ్పడుతాయని వివరించారు.
సేలం: ఈరోడ్‌లోని వీరప్పన్‌చత్రం, కామరాజ్ రోడ్ ప్రాంతానికి చెందిన రవిచంద్రన్ (64). ఆయన డీఎంకే 23వ వార్డు ప్రతినిధిగా ఉన్నారు. గురువారం ఉదయం ఈరోడ్ టిండల్ సమీపంలో జరిగిన డీఎంకే ప్రచార సభకు ఆయన వెళ్లారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సభకు రాకముందే, రవిచంద్రన్ ఉదయం 9 గంటల ప్రాంతంలో మైదానంలోకి నడిచి వెళుతుండగా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. ఇదిచూసిన డీఎంకే కార్యనిర్వాహకులు, పార్టీ సభ్యులు అతన్ని ఈరోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్ధారించారు.
సాక్షి, చైన్నె: డీఎంకే అధ్యక్షుడు,సీఎం ఎంకే స్టాలిన్ అల్లుడు శబరీషన్ ప్రపథమంగా రాజకీయ వేదికపై వచ్చారు. విల్లివాక్కం డీఎంకే అభ్యర్థి కార్తీక్ మోహన్ పరిచయ కార్యక్రమంలో ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేశారు. టీవీకే అధినేత విజయ్ తమకు పోటీయే కాదని ఎద్దేవా చేశారు. స్టాలిన్ అల్లుడు శబరీషన్ ఇది వరకు రాజకీయ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన లేదు. ఇటీవల ఓ మారు ఆయన సీఎం స్టాలిన్ వాహనానికి రథసారథి అయ్యారు. ఈ సమయంలో పెద్ద చర్చే జరిగింది. అయితే, రాజకీయాలకు దూరంగా శబరీషన్ ఉంటూ వచ్చారు. ఈ పరిస్థితులలో గురువారం సాయంత్రం చైన్నెలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శేఖర్‌బాబు ఆయన్ని ఆహ్వానించారు. విల్లివాక్కంలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి కార్తిక్‌మోహన్ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విజయ్ గురించి ప్రశ్నలకు ఆయన రాజకీయంగా ధీటైన వ్యాఖ్యలు చేశారు. టీవీకే తమకు పోటీయే కాదని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే బ్రహ్మాండ విజయం సాధించడం తథ్యమని దీమా వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి డీఎంకే కుటుంబ రాజకీయాలు అంటూ విరుచుకు పడుతూవస్తున్నారు. ఈ సమయంలో శబరీషన్ ప్రప్రథమంగా డీఎంకే కార్యక్రమంలో ప్రత్యక్షం కావడం గమనార్హం.
అన్నానగర్: తూత్తుకుడి జిల్లా, సాత్తాంగులంకు చెందిన జయరాజ్ (59) వ్యాపారి. ఇతని కుమారుడు పెన్నిక్స్ (31). వీరిద్దరికీ సాత్తంగుళం బజార్‌లో సెల్‌ఫోన్ దుకాణం ఉండేది. జూన్ 19, 2020న, కరోనా కర్ఫ్యూ అమల్లో ఉంది. ఆ సమయంలో రాత్రిపూట దుకాణం తెరిచి ఉంచినందుకు సాత్తంగుళం పోలీసులు తండ్రీ, కొడుకులను పోలీస్ స్టేషన్‌కు పిలిచి, కొట్టి చంపారు. దీని తరువాత, అప్పటి సాత్తంగుళం ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఎస్‌ఐ లు బాలకృష్ణన్, రఘుగణేష్, స్పెషల్ ఎస్‌ఐ పాల్‌దురై, కానిస్టేబుళ్లు మురుగన్, ముత్తురాజ్, చామదురై, చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, వేయిలుముత్తు సహా 10 మందిని అరెస్టు చేసి మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. విచారణ సమయంలో పాల్‌దురై కరోనాతో మరణించాడు. దీంతో మిగిలిన 9 మంది పై కేసు విచారణ మదురై మొదటి 2 అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. మార్చి 23న ఈ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తి జి. ముత్తుకుమారన్ , 9 మంది పోలీసులను దోషులుగా ప్రకటించారు. గురువారం ఉదయం కేసు విచారణకు వచ్చింది. ఆ సమయంలో తమిళనాడు ముఖ్య కార్య దర్శి, పోలీసులు నివేదికలు దాఖలు చేశారు. అలాగే సీబీఐ హాజరై 9 మంది నేరస్థులందరికీ మరణశిక్ష విధించాలి. పోలీసుల క్రూరత్వానికి సంబంధించి మరణశిక్ష విధించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది అని పేర్కొంది.


