ప్రచారం ప్రారంభం
తిరుత్తణి: తిరుత్తణి మురుగన్ ఆశీస్సులతో డీఎండీకే విజయం ఖాయమని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమితో జతకట్టిన డీఎండీకే 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇందులోభాగంగా ప్రేమలత విజయకాంత్ తిరుత్తణి మురుగన్ ఆలయంలో బుధవారం సాయంత్రం తిరుత్తణి కొండ ఆలయంకు చేరుకున్నారు. వెండి వేల్ చేతబట్టి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ప్రచార వాహనంలో పట్టణంలోని ప్రధాన వీధుల్లో రోడ్‌షో నిర్వహించి తిరుత్తణి డీఎండీకే అభ్యర్థి కృష్ణమూర్తికి ప్రచారం చేశారు. అనంతరం చిత్తూరు రోడ్డు జంక్షన్‌లో అశేష జనవాహిని మధ్య ఆమె రోడ్‌షో చేశారు. పంగుణి ఉత్తరం సందర్భంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు, డీఎండీకే విజయం వైపు పయనించేందుకు మురుగన్ ఆశీస్సులు పొందినట్లు తెలిపారు. డీఎంకే మ్యానిఫెస్టో ప్రజలను ఆకట్టుకుంటోందని అన్నారు. డీఎంకే 2.0 పాలనకు డీఎంకే కూటమిలోని డీఎండీకేను గెలిపించాలని పిలుపునిచ్చారు. కేజీ.కండ్రిగ, పొదటూరుపేట, పళ్లిపట్టు, అత్తిమాంజేరిపేట, ఆర్కేపేట, అమ్మయార్‌కుప్పం ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది.


