వేలూరు: తిరువణ్ణామలై తమిళ పంగుణి మాస పౌర్ణమి గిరివలయం వెళ్లేందుకు సమయం బుధవారం ఉదయం 7.36 గంటలకు ప్రారంభమై గురువారం 7.56 గంటలకు ముగిసింది. దీంతో బుధవారం సాయంత్రం తిరువణ్ణామలై భక్తులతో కిటకిటలాడింది. పంగుణి ఉత్సవంలో భాగంగా బుధవారం సాయంత్రం స్వామి అమ్మవార్లుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. అనంతరం భక్తుల హరోంహరా నామస్మరణాల మధ్య స్వామివారికి తిరుకల్యాణోత్సవం నిర్వహించారు. ఇందులోభాగంగా అన్నామలైయార్, ఉన్నామలై అమ్మవారు ఆలయ ధ్వజారోహణం వద్ద భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారిని గిరివలయంలో భక్తుల దర్శనార్థం పుష్పాలంకరణల మధ్య మాడ వీధుల్లో వృషభ వాహనంపై ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అరుణాచలేశ్వరాలయ కొండ చుట్టూ ఉన్న 14 కిలోమీటర్లు కాలి నడకన గిరివలయం చుట్టి స్వామి వారిని దర్శించుకున్నారు. తిరువణ్ణామలై పట్టణంలోనూ, గిరివలయం రోడ్డుతోపాటు మాడ వీధులు భక్తులతో కిటకిటలాడాయి.


