సాక్షి, చైన్నె: సీట్ల సర్దుబాటులో తాము త్యాగం చేశామని డీఎంకే కూటమిలోని వీసీకే నేత తిరుమావళవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆయన ఇంకా అసంతృప్తిలోనే ఉన్నట్టుగా చర్చ ఊపందుకుంది. అదే సమయంలో ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే షానవాస్ హుందాగా స్పందించారు. డీఎంకే కూటమిలో వీసీకేకు 8 స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా, కీలక నేతగా ఉన్న షానవాస్‌కు ఈసారి సీటు ఇవ్వలేదు. దీంతో తిరుమావళవన్‌ను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. దురుద్దేశంతోనే షానవాసన్‌ను పక్కన పెట్టారన్న విమర్శలు బయలుదేరాయి. ఇందుకు వివరణ ఇస్తూ తిరుమావళవన్ కూటమిపై అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం.
ఉద్దేశపూర్వకం కాదు
ఆలూరు షానవాస్‌ను పక్కన పెట్టాలనే ఉద్దేశం పార్టీకి లేదని తిరుమావళవన్ స్పష్టం చేశారు. నాగపట్నం నియోజకవర్గం మళ్లీ తమకే దక్కి ఉంటే కచ్చితంగా ఆయనకే సీటు ఇచ్చేవాడినని పేర్కొన్నారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు జవాహిరుల్లా మనిదనేయమక్కల్ కట్చికి వెళ్లిందని తెలిపారు. షానవాస్ రాయపురం లేదా పల్లవరం నుండి పోటీ చేయాలని భావించారని, అయితే పల్లవరం సీటు డీఎండీకే కేటాయించారని పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ సీట్ల సర్దుబాటును త్వరగా ముగించాలని కోరడంతో, అత్యవసర పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందన్నారు. ఈసారి అబ్దుల్ రహ్మాన్‌కు ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే షానవాస్‌ను పక్కన పెట్టక తప్పలేదన్నారు.
ఆలూరు షానవాస్ హుందాతనం
తనకు టిక్కెట్ దక్కకపోవడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై ఆలూరు షానవాస్ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీలో ఎవరికి ఎప్పుడు అవకాశం ఇవ్వాలనేది అధినాయకత్వం తీసుకునే నిర్ణయమని, దాన్ని గౌరవించడమే క్రమశిక్షణ గల కార్యకర్త లక్షణమని పేర్కొన్నారు. 2026 ఎన్నికల్లో తిరుమావళవన్ సహా వీసీకే అభ్యర్థులందరూ విజయం సాధించాలని, మళ్లీ డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడాలని, అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తాజగా మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశం తనకు దక్కిందని, ప్రజల మధ్యలో ఉంటూ రాజకీయ క్షేత్రంలో పనిచేస్తానని స్పష్టం చేశారు.


