వేలూరు: తమిళ పంగుణి ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి వారికి తిరుకల్యాణోత్సవం వైభవంగా జరిగింది. తిరువణ్నామలై అరుణాచలేశ్వరాలయంలో డిసెంబర్ మాసంలో మహా దీపోత్సవం పది రోజుల పాటూ జరుగుతుంది. అదే విధంగా పంగుణి ఉత్సవాలను కూడా ఏప్రిల్ మాసంలో నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా పంగుణి మాస కణోత్సవం పంచమూర్తుల సాక్షిగా ఆలయ మణి మండపం వద్ద అన్నామలైయార్, ఉన్నామలై అమ్మవారి ఆలయ ద్వజా రోహణం వద్ద భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శివాచార్యులు వేద మంత్రాల నడుమ భక్తుల హరోం హరా నామస్మరణ మధ్య తిరుకల్యాణోత్సవ వైభవం నిర్వహించారు. స్వామివార్ల వద్ద నవధాన్యాలు, పట్టు వస్త్రాలు ఉంచారు. ముందుగా అన్నామలైయార్, ఉన్నామలై అమ్మవారు, పరాశక్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో వల్లి దైవాన సమేద సుబ్రమణ్య స్వామి వారికి, బాలమది కొయందై వేలాయుద బాని స్వామి, సైదాపేటలోని మురుగర్‌లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేసిన స్వామి వార్లుకు ప్రత్యేక దీపారధన పూజలు చేశారు.


