– వైగో సంచలన నిర్ణయం
సాక్షి, చైన్నె : తమకు కూటమి కేటాయించిన 4 స్థానాలలోనూ డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేయనున్నామని ఎండీఎంకే నేత వైగో ప్రకటించారు. డీఎంకే కూటమిలో ఎండీఎంకేకు నాలుగు సీట్లు ఇచ్చారు. ఇందులో మూడు చోట్ల డీఎంకే ఉదయ సూర్యడి చిహ్నం , ఓ చోట సొంతగుర్తుపై పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ పరిస్థితులలో బుధవారం మీడియాతో వైగో మాట్లాడుతూ అన్ని స్థానాలలోనూ డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో తమ అభ్యర్థులు పోటీచేస్తారని ప్రకటించారు. సీర్గాలి, మధురై దక్షిణం, కడయనల్లూరు, మొడకురిచ్చిలో తమ అభ్యర్థులు ఉదయ సూర్యుడు గుర్తుపైనే పోటీ చేస్తారని వైగో అధికారికంగా ప్రకటించారు. దీంతో డీఎంకే చిహ్నంలో పోటీచేస్తున్న అభ్యర్థుల సంఖ్య 176కు చేరింది. ఇందులో 164 స్థానాలలో డీఎంకే అభ్యర్థులు ఉండగా, మిగిలిన స్థానాలలో మిత్ర పక్షాల అభ్యర్థులు ఉదయ సూర్యడి చిహ్నంలో పోటీ చేస్తుండడం విశేషం. ఇక, కాంగ్రెస్ ప్రజలు గుర్తెరిగిన హస్తం గుర్తులో, సీపీఎం,సీపీఐలు వారి జాతీయ స్థాయి గుర్తులతో, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ జాతీయ స్థాయి గుర్తు నిచ్చెనలో పోటీచేస్తున్నాయి. కాగా కూటమిలోని వీసీకే 8 చోట్ల కుండగుర్తుపై బరిలో దిగుతోంది. కొత్త గుర్తులపై పోటీ చేయడం కన్నా, డీఎంకే ఉదయ సూర్యుడి ద్వారా పోటీ చేస్తే గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయని భావించే వైగో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తమ సొంత గుర్తులపై కాకుండా డీఎంకే గుర్తుపై పోటీ చేయడం వల్ల ఓటర్లలో గందరగో ళం తగ్గుతుందని,ఇది కూటమి విజయానికి దోహ దపడుతుందని వైగో భావించడం గమనార్హం.
గిండి నేషనల్ పార్క్‌లో తగ్గిన కృష్ణజింకల సంఖ్య
కొరుక్కుపేట: గిండి జాతీయ పార్కులో అడవి జింకల సంఖ్య 90కి పడిపోవడం ప్రకృతి ప్రేమికులలో ఆందోళన కలిగిస్తోంది. చైన్నెలోని గిండి జాతీయ ఉద్యానవనం , రాజభవన్ ప్రాంతాల్లో ఇటీవల నిర్వహించిన జనాభా గణనలో, కష్ణ జింకలుగా కూడా పిలిచే అడవి జింకల సంఖ్య 101 నుండి 90కి తగ్గిపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా కృష్ణ జింకల సంఖ్య తగ్గడానికి ఆవాసాల క్షీణతే ప్రధాన కారణంగా తేలింది.
మహిళా సంక్షేమం..
ఉచితాలు కావు!
సాక్షి, చైన్నె : మహిళా సంక్షేమ పథకాలు కేవలం ఉచితాలు కా వని, అవి సామాజిక పెట్టుబడులు అని డీ ఎంకే డిప్యూటీ ప్రధా న కార్యదర్శి, పార్లమెంటరీ నేత కనిమొళి కరుణానిధి స్పష్టం చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను తిప్పి కొట్టే విధంగా మరోమారు బుధవారం మీడియా ముందు ఆమె స్పందించారు.
ఇది సామాజిక పెట్టుబడి
మహిళలను వంటింటికే పరిమితం చేయకుండా వారిని బయటకు తీసుకువచ్చి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కనిమొళి పేర్కొన్నారు. మహిళల పేరు మీద ఆస్తుల రిజిస్ట్రేషన్ చేస్తే స్టాంప్ డ్యూటీ తగ్గించడం వంటి నిర్ణయాలు విప్లవాత్మకమైనవని ఆమె వివరించారు. పుదుమై పెన్, తమిళ పుదల్వన్, అల్పాహార పథకం వంటివి ఇప్పటికే ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. పొల్లాచ్చి ఘటన ప్రస్తావన: గతంలో పొల్లాచ్చిలో మహిళలు, యువతులపై జరిగిన లైంగిక ఘటనలను గుర్తుచేస్తూ, మహిళల భద్రత, హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తేల ఏదన్నారు. 80,000 వేల మంది సూచనలతో ప్రజా మేనిఫెస్టో రూపకల్పన జరిగిందన్నారు. అమలు సాధ్యమయ్యే హామీలే ప్రకటించామన్నారు. కేవలం ఓట్ల కోసం కాకుండా, ప్రతి హామీని ఎలా అమలు చేయాలో ఆయా రంగాల నిపుణులతో చర్చించిన తర్వాతే మేనిఫెస్టోలో చేర్చినట్లు ఆమె తెలిపారు.
నేటి నుంచి పళణి
మలి విడత ప్రచారం
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళణి స్వామి గురువారం నుంచి మలి విడత ప్రచారం చేపట్టనున్నారు. ఈ ప్రచారం 18వ తేదీ వరకు జరగనున్నది. గత నెల చివరల్లో మైలాపూర్ నుంచి ఎన్నికల ప్రచారానికి పళణి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. బుధవారం రామనాథపురం, శివగంగ, పుదుకోట్టై జిల్లాల అభ్యర్థులకు మద్ద తుగా సుడిగాలి పర్యటన చేశారు. ఈ పరిస్థితుల్లో గురువారం ధర్మపురం, కృష్ణగిరి జిల్లాలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ మలి విడత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. శుక్రవారం వాణియంబాడి, తిరపత్తూరు జిల్లాలో, 4న తిరువణ్ణామలై, విల్లుపురం జిల్లాలో, 5న పుదుచ్చేరి, కడలూరులలో, 7న అరియలూరు, పెరంబలూరు జిల్లాలో పర్యటించనున్నారు.


