సాక్షి, చైన్నె: తమ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు టీవీకే సంయుక్త కార్యదర్శి నిర్మల్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయనకు లేఖ రాశారు. పెరంబదూరు, కొళత్తూరు పర్యటనలో విజయ్‌కు పోలీసులు భద్రత కల్పించాలేక పోవడంతో విల్లివాక్కం, అన్నానగర్‌లో ప్రచారం వాయిదా వేసుకోవాల్సి వచ్చినట్టు అందులో వివరించారు. విజయ్ వై కేటగిరి భద్రతలో ఉన్నారని, అయినా ఆయనకు ఎన్నికల ప్రచారంలో సరైన భద్రత కల్పించడం లేదని పేర్కొన్నారు. విజయ్ ప్రచారానికి, విజయ్‌కు తగిన భద్రత కల్పించే విధంగా కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, విజయ్‌కు భద్రత కల్పించడంలో చైన్నె పోలీసు కమిషనర్, చైన్నె ఎన్నికల అధికారి విఫలమయ్యారని, ఆ ఇద్దర్నీ బదిలీ చేసి, కొత్త వారిని నియమించాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు టీవీకే తరపున ఫిర్యాదు చేశారు. అదే సమయంలో విల్లివాక్కం పరిధిలో జరిగిన పార్టీ అభ్యర్థి ఆధవ్ అర్జున ఎన్నికల ప్రచార సభలో పగల కొట్టిన బాటిళ్లను విసరడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారాన్ని సైతం టీవీకే తీవ్రంగా పరిగణించి, భద్రత కల్పించాలని విన్నవించింది. అదే సమయంలో గురువారం విజయ్ తిరుచ్చి వెళ్లనున్నారు. తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో ఆయనకు అక్కడ ఏ మేరకు భద్రత అన్నది దక్కనుందో అన్న ఆందోళనను టీవీకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రోడ్ షోకు విజయ్ నిర్ణయించగా, అక్కడి ఎన్నికల అధికారులు, పోలీసులు అనుమతి నిరాకరించారు.
పొర్కొడికి ప్రాణహాని
తిరువీకానగర్‌లో పోటీ చేస్తున్న దివంగత ఆర్మ్‌స్ట్రాంగ్ సతీమణికి భద్రత కల్పించాలని తమిళనాడు బీఎస్పీ పార్టీ డిమాండ్ చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న ఆమెకు అన్నాడీఎంఎంకే సీటు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆమెకు తిరువీకానగర్‌లో భద్రత కొరవడిందని, ఆమె ప్రాణాలకు హాని ఉందన్న ఆందోళన నెలకొంది. దీంతో ఆమె మద్దతుదారులే కాదు, వీసీకే నేత తిరుమావళవన్ సైతం ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఆమెకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది.


