19 శాతం వార్షిక వృద్ధి నమోదు
సాక్షి, చైన్నె : గతంతో పోల్చితే ఈ సారి 19 శాతం వార్షిక వృద్ధి నమోదైనట్టు జేఎస్‌డబ్ల్యు ఎంజీ ఇండియా ప్రకటించింది. బుధవారం ఇందుకు సంబంధించిన నివేదికను స్థానికంగా విడుదల చేశారు. మార్చి 2026లో కంపెనీ మొత్తం 6,528 హోల్‌సేల్ యూనిట్లను విక్రయించిందని పేర్కొన్నారు. 2025 మార్చి నెలతో పోలిస్తే ఇది 19 శాతం వృద్ధిని సూచిస్తున్నట్టు వివరించారు. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ , న్యూ ఎనర్జీ వెహికల్ విభాగాల్లో పట్టును నిలబెట్టుకున్నట్టు పేర్కొన్నారు.
ప్రియుడు వదిలి వెళ్లడంతో ప్రియురాలు ఆగ్రహం
అన్నానగర్: చైన్నె కొడుంగైయూర్ ప్రాంతానికి చెందిన సుధాకర్. ఇతనికి భార్య , ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఈ స్థితిలో, తన భర్త నుండి విడిగా నివసిస్తున్న కొడుంగైయూర్ లోని కన్నదాసన్ నగర్‌కు చెందిన రమ్య (38)తో సుధాకర్ కు పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా, వారిద్దరూ కలిసి జీవించడం ప్రారంభించారు. ఈలోగా, గత సంవత్సరం నవంబర్‌లో, వారిద్దరూ కలిసి కొడుంగైయూర్‌లోని కామరాజ్ సాలైలో ఓ బైక్ షోరూంను ప్రారంభించారు. ఆర్థిక సమస్య కారణంగా కొన్ని నెలల్లోనే వారు ఆ బైక్ షోరూంను మూసివేశారు. దీని తర్వాత, సుధాకర్, రమ్య మధ్య అప్పుడప్పుడు వాగ్వాదాలు, గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంగా, సుధాకర్ గత వారం నుండి రమ్యకు దూరంగా ఉండి, మళ్లీ తన భార్యతో కలిసి జీవించడం ప్రారంభించాడు. సుధాకర్ నిర్ణయంతో ఆగ్రహించిన రమ్య, నల్ల బురఖా ధరించి, మంగళవారం రాత్రి సుమారు 12 గంటలకు సుధాకర్ ఇంటికి వచ్చి, అతని ఇంటి బయట నిలిపి ఉన్న ద్విచక్ర వాహనం పై, ఇంటి తలుపుపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయింది.దీంతో సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బుధవారం ఉదయం రమ్యను అరెస్టు చేశారు.
ప్లస్–2 విద్యార్థిని
ఆత్మహత్య
తిరుత్తణి: తిరుత్తణి అమృతపురానికి చెందిన కుమరేశన్ కుమార్తె మోనిష(17) కేజీ.కండ్రిగలోని ప్రయివేటు పాఠశాలలో ప్లస్‌టూ చదువుతూ ఇటీవల ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షలు రాశారు. తండ్రి కుమరేశన్ విదేశాల్లో పని చేస్తుండగా ఇంట్లో తల్లి మోహనతో ఇద్దరు అమ్మాయిలు వుండేవారు.ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా వున్న గదిలో విద్యార్థిని మోనిష ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తిరుత్తణి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామీణ మహిళలకు జీవనోపాధి
సాక్షి, చైన్నె: గ్రామీణ మహిళలకు జీవనోపాధి కల్పించే లక్ష్యంతో సరికొత్త నైపుణ్య అభివృద్ధి కార్యక్రమానికి శామ్ సంగ్ శ్రీకారం చుట్టింది. కాంచీపురం జిల్లాలోని సంత వెల్లూరు, సిరుమంగడు గ్రామాలకు చెందిన 200 మంది మహిళలకు వృత్తి విద్యా శిక్షణ అందించేందుక చర్యలు తీసుకన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం శామ్‌సంగ్ ఇండియా ’బాల్ రక్ష భారత్’ (సేవ్ ది చిల్డ్రన్, ఇండియా) సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు 12 వారాల పాటూ ప్రొఫెషనల్ టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం గుర్తింపుతో సర్టిఫికేట్లు అందజేస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన మహిళలకు శామ్‌సంగ్ ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయనుంది. దీనివల్ల వారు స్వయం ఉపాధి పొందేందుకు లేదా చిన్నపాటి వ్యాపారాలు శామ్ సంగ్ శ్రీపెరంబుదూర్ ప్లాంట్ ప్రెసిడెంట్ ఎస్.హెచ్. యూన్ మాట్లాడుతూ, తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధిలో ముందుందని, స్థానిక మహిళలకు నైపుణ్యాలు అందించడం ద్వారా వారిని ఆర్థికంగా స్వతంత్రులను చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.తమిళనాడు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న మహిళా సాధికారత, నైపుణ్య అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్లనున్నామన్నారు.
మద్యం బాటిళ్లు నిల్వ
ఉంచిన టీవీకే నేత అరెస్టు
అన్నానగర్: నాగపట్టణం జిల్లాలోని వైమేడు నడుక్కాడు ప్రాంతానికి చెందిన మునియప్పన్ కుమారుడు అరుల్ పాండి (27). టి.వి.కె. వేదారణ్యం సౌత్ యూనియన్ కార్యదర్శి అయిన ఇతని ఇంట్లో మద్యం సీసాలను అమ్మకం కోసం నిల్వ ఉంచుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వైమేడు పోలీసులు మంగళవారం సాయంత్రం అరుల్ పాండి ఇంటికి వెళ్లి సోదా చేశారు. సోదా సమయంలో, అతని ఇంట్లో అమ్మకానికి 30 సీసాల మద్యం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో అతడిని అరెస్టు చేశారు.


