తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పంగుణి ఉత్తరం సందర్భంగా బుధవారం భక్తజన సందడి నెలకొంది. పంగుణి ఉత్తరం సందర్భంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి వేకువజామున విశేష అభిషేక పూజలు నిర్వహించి బంగారు ఆబరణాలతో అలంకరించి దీపారాధన పూజలు నిర్వహించారు. ఉదయం పది గంటలకు భక్తులు తీసొకొచ్చిన పాలబిందులతో ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామికి కావడి మండపంలో పాలు, విభూది. పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కావడి మండపంలో వేచివున్న భక్తులు హారోంహర నామస్మరణతో స్వామి దర్శనం చేసుకున్నారు. పంగుణి ఉత్తరం సందర్భంగా చైన్నె సహా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాలు, పన్నీరు.నెమలి కావళ్లతో పాదయాత్రగా తిరుత్తణికి చేరుకుని మెట్లు మార్గంలో కొండ ఆలయం చేరుకున్నారు. దీంతో మాడ వీధుల్లో భక్తుల సందడి నెలకొంది. చాలా మంది తమ మొక్కులు చెల్లించే విధంగా శరీరంకు చువ్వలు గుచ్చుకుని దవడలకు శూలం గుచ్చుకుని స్వామిని దర్శించుకున్నారు. కావళ్లు, భక్తులు మొక్కులు తీర్చే విధంగా ఇనుప చువ్వలు గుచ్చుకుని స్వామి దర్శనం చేసి మొక్కులు చెల్లించారు. ఉచిత దర్శనం మార్గంలో మూడు గంటలు రూ. వంద ప్రత్యక మార్గంలో రెండు గంటల పాటు భక్తులు వేచివుండి స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయ నిర్వాహకులు పంగుణి ఉత్తరం వేడుకల ఏర్పాట్లు చేశారు.


