క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Mar 28 2026 7:52 AM | Updated on Mar 28 2026 7:52 AM

మల్టీప్లెక్స్‌లో హెచ్‌డీఆర్‌ స్క్రీన్లు

సాక్షి, చైన్నె: సినీ ప్రియులకు సరికొత్త అనుభూతిని అందించడం లక్ష్యంగా మల్టీప్లెక్స్‌లో హెచ్‌డీఆర్‌ స్క్రీన్లతో అద్భుతాన్ని సృష్టించామని ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్‌ ఎండీ రమేష్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ విషయంగా స్థానికంగా తమ ఆవిష్కరణ గురించి ప్రకటించారు. భారత్‌లోనే అతిపెద్ద హెచ్‌డీఆర్‌ సినిమా ఆడిటోరియంను ప్రసాద్స్‌ యాజమాన్యం ప్రారంభించిందన్నారు. పీసీఎక్స్‌ హెచ్‌డీఆర్‌ బైబార్కో పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ థియేటర్‌, ప్రేక్షకులకు వెండితెరపై మునుపెన్నడూ లేని అనుభూతి, అద్భుతం చూస్తారన్నారు. ఈ ఆడిటోరియంలో బార్కో 4ఓ లేజర్‌ హెచ్‌డీఆర్‌ ప్రొజెక్టర్‌ను కలిగి, లైట్‌ స్టీరింగ్‌ టెక్నాలజీతో పనిచేస్తుందని వివరించారు. సాధారణ స్క్రీన్లకంటే భిన్నంగా, ఇది 300 నిట్స్‌ వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుందన్నారు. కొత్త ఫ్లాట్‌ యాస్పెక్ట్‌ రేషియో స్క్రీన్‌, మెరుగైన సీటింగ్‌, అత్యాధునిక సౌండ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ తొలి ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగిందని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

విద్యార్థిని మృతి

తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కళాశాల విద్యార్థిని మృతి చెందిన క్రమంలో మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. తిరువళ్లూరు జిల్లా తిరువేర్కాడు ప్రాంతానికి చెందిన సురేష్‌కుమార్‌ కుమార్తె దివ్యప్రియ(19) చైన్నెలోని ప్రైవేటు కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో శుక్రవారం ఉదయం దివ్యప్రియతో పాటు మరో ఇద్దరు యువకులతో సహా విద్యార్థినులు కారులో తడలోని వాటర్‌ ఫాల్స్‌కు బయలుదేరారు. పొన్నేరి సమీపంలో కారు వెళ్తున్న క్రమంలో తచ్చూరు హైవే నుంచి కిందకు దిగుతున్న సమయంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దివ్యప్రియ తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. ఈ ప్రమాదంలో మూర్తి, హరీష్‌కుమార్‌, సాత్విక, హరిణి, శాలినీ సహా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వెళ్లిన కవరపేట పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పొన్నేరి వైద్యశాలకు తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవరపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

ఆస్పత్రి సిబ్బందిపై

చర్యలు తీసుకోండి

తిరువొత్తియూరు: చెంగల్పట్టు జిల్లా, తిరుప్పోరూర్‌ వద్ద కొట్టమేడు ప్రాంతంలో నివశిస్తున్న గిరిజన సామాజిక వర్గానికి చెందిన భాగ్యం (56) గత 5 రోజుల క్రితం అనారోగ్యంతో చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. గురువారం రాత్రి మృతిచెందారు. అత్యవసర చికిత్స విభాగం నుండి భాగ్యం మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. ఆ సమయంలో ఆమె మృతదేహాన్ని స్ట్రెచర్‌పై ఎక్కించాల్సిన ఉద్యోగి మృతురాలి బంధువులను రూ.1000 అడిగాడు. దానికి భాగ్యం బంధువులు, గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారమని, ఇప్పటికే పేదరికంతో బాధపడుతున్నామని తెలిపారు. తమ దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పి రూ.500 ఇచ్చారు. ఆ డబ్బును ఆస్పత్రి ఉద్యోగి తీసుకోవడానికి నిరాకరించి దురుసుగా ప్రవర్తించాడు. ఆ ఉద్యోగికి మద్దతుగా తోటి ఉద్యోగులు గుమిగూడి రూ.1000 ఇస్తేనే మృతదేహాన్ని పోస్టుమార్టానికి తీసుకువెళ్తామని చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వ ఆస్పత్రి యాజమాన్యం తక్షణమే సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

కారు గుంతలో పడి బీజేపీ నాయకుడి మృతి

అన్నానగర్‌: తంజావూరు జిల్లాలోని పెరుమగలూరు గ్రామానికి చెందిన రాజరత్నం(45) వంటగ్యాస్‌ పంపిణీదారుడు. ఇతను తంజావూరు జిల్లా బీజేపీ పారిశ్రామిక యూనిట్‌కు జిల్లా పరిశీలకుడిగా ఉన్నాడు. ఇతను శుక్రవారం పట్టుకోట్టై నుండి తన స్వగ్రామమైన పెరుమగలూరుకు కారులో వెళుతున్నాడు. అతను నైనంగుళం సమీపిస్తుండగా, కారు అనుకోకుండా అదుపుతప్పి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజరత్నం అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

డివైడర్‌ను ఢీకొట్టిన లారీ

– తొలగింపు ఆలస్యం..స్తంభించిన ట్రాఫిక్‌

తిరువొత్తియూరు: చైన్నె, రెడ్‌హిల్స్‌ వద్ద పోర్టుకు వెళుతున్న లారీ రోడ్డు డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై నిలిచి పోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆంధ్రా నుంచి చైన్నె పోర్టుకు శుక్రవారం తెల్లవారుజామున గ్రానైట్‌ లోడ్‌తో లారీ వస్తోంది. రెడ్‌ హిల్స్‌, వడకరై వద్ద డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు మధ్యలో ఆగిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ గాయాల్లేకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. లారీ ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. నిద్రమత్తులో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లారీ వస్తుండగా, లారీని నడుపుతున్న వ్యక్తి కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తెల్లవారుజాము కావడంతో అటుగా ఇతర వాహనాలు రాలేదు. దీంతో ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఉదయం 10 గంటల వరకు ప్రమాదానికి గురైన లారీని తరలించకుండా అక్కడే నిలిపి ఉంచినట్లు చెబుతున్నారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహన రాకపోకలు స్తంభించాయి. రెడ్‌హిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌ వద్ద ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement