వేలూరు: రాష్ట్రంలో పార్టీలు మారినా, ముఖ్యమంత్రులు మారినా పాలనా పద్ధతి మాత్రం మారలేదని నామ్ తమిలర్ పార్టీ ఆర్గనైజర్, సినీ డైరెక్టర్ సీమాన్ అన్నారు. ఆ పార్టీ వేలూరు, అనకట్టు, కాట్పాడి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా ఆయన వేలూరులో ప్రచారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పార్టీలు మారినా ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు మారినా దేశ ప్రజలకు నాణ్యమైన విద్యను అందించామని నిజాయితీగా చెప్పగలరా అని ప్రశ్నించారు. అదేవిధంగా ఆరోగ్య సంరక్షణా ప్రమాణాలను విజయవంతంగా మెరుగు పరిచిందని ధైర్యంగా చెప్పగలరా అన్నారు. వీరు నిరంతరాయ విద్యుత్ ఉత్పత్తిని, పంపిణీ నిర్ధారించారా, సరైన రహదారులను గానీ, నాణ్యమైన ప్రజా రవాణా వ్యవస్థనుగానీ కల్పించారా అని అడిగారు. చదువులు పూర్తి చేసుకొని టీఎన్‌పీఎస్సీ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నార అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా పరిశ్రమలు స్థాపించకుండా అన్నీ అభివృద్ధి చేశామని సంకలు గుద్దుకోవడం సరికాదన్నారు. రాష్ట్రం అప్పుల ఊబీ లో చిక్కుకుందన్నారు. రైతాంగం తన జీవితమంతా కష్టపడి సర్వశక్తులు కోల్పోయి అలసిపోతున్నా రని, రైతులకు ఈ ప్రభుత్వాలు ఏమి చేశాయో ప్రశ్నించుకోవాలన్నారు. ద్రావిడ పార్టీలకు మార్చి మార్చి ప్రజలు ఓట్లు వేశారని తమకు ఒక్క అవకాశం కల్పిస్తే మార్పును తీసుకొస్తామన్నారు.


