తమిళసినిమా: ఇప్పుడు మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా చిత్రాలు చేయాల్సిన పరిస్థితి. అదే సమయంలో పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలు రూపొందుతూ ప్రేక్షకులను సంతృప్తి పరుస్తున్నాయి. తాజాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం బైకర్. తెలుగు, తమిళం, మలయాళం తదితర రూపొందిన ఈ చిత్రంలో బహు భాషా నటుడు శర్వానంద్ కథానాయకుడిగా, ప్రముఖ నటుడు రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన ఇందులో నటి మాళవిక నాయర్ నాయకిగా నటించారు. అతుల్ కులకర్ణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్ రెడ్డి సమర్పణలో వంశీ కృష్ణా రెడ్డి నిర్మించారు. జిబ్రాన్ సంగీతాన్ని, మది ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బైకర్ చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చైన్నెలోని సత్యం థియేటర్లో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న చిత్ర దర్శకుడు అభిలాష్ రెడ్డి ఇది రేస్ గురించిన కథ మాత్రమే కాదని, ఇందులో బలమైన మానవ భావోద్రేకాలు ఉంటాయని చెప్పారు. బైకర్ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు. నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ తాను ఇదుదాండా పోలీస్ చిత్ర షూటింగ్లో నటిస్తున్నప్పుడు ప్రమాదానికి గురి రెండు కాళ్లు పోయే పరిస్థితికి గురయ్యానన్నారు. ఆ చిత్రం అప్పట్లో పెద్ద విజయాన్ని సాధించిందన్నారు.అదే విధంగా మూడు నెలల క్రితం తన కాలికి బలమైన గాయం అయ్యిందన్నారు. ఆ విధంగా చూస్తే ఈ బైకర్ చిత్రం కూడా పెద్ద హిట్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర కథానాయకుడిగా శర్వానంద్ మాట్లాడుతూ ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం నుంచి కణమ్ చిత్రం వరకు తమిళ ప్రేక్షకులతో తనకు మంచి సన్నిహితం ఉందన్నారు. తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రతి సారి వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుంటున్నానన్నారు. బైకర్ చిత్రం తన కెరీర్‌లోనే ఉత్తమ చిత్రం అవుతుందన్నారు. ఇది ఇండియన్ సినిమాలోనే తొలి మోట్రోక్రాస్ కథా చిత్రం అని శర్వానంద్ పేర్కొన్నారు.


