అడుగంటుతున్న భూగర్భ జలం | - | Sakshi
Sakshi News home page

అడుగంటుతున్న భూగర్భ జలం

Mar 24 2026 7:58 AM | Updated on Mar 24 2026 7:58 AM

● 29 జిల్లాల్లో నీటి ఎద్దడి ముప్పు

సాక్షి,చైన్నె: తమిళనాడులో వేసవి కాలం పలుజిల్లాలో నీటి ఎద్దడిని సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో 29 జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయని జలవనరుల శాఖ తాజా పరిశీలనలో తేలింది.. గత ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ, భూగర్భ జలాలు పెరగకపోవడం పర్యావరణవేత్తలను విస్మయానికి గురిచేసిన విషయం తెలిసిందే.

తీవ్రంగా ప్రభావితమయ్యే జిల్లాలు

భూగర్భ నీటి మట్టం తగ్గడంలో పశ్చిమ తమిళనాడు జిల్లాలు మొదటి వరుసలో ఉన్నాయి.దిండిగల్‌, తిరుప్పూర్‌ జిల్లాల్లో అత్యధికంగా 2.58 మీటర్ల మేర నీటిమట్టం పడిపోయింది.కోయంబత్తూరులో 2.07 మీటర్ల తగ్గుదల నమోదైంది. సేలం ,ధర్మపురిలలో వరుసగా 1.68 మీటర్లు ,0.62 మీటర్ల మేర నీరు అడుగంటింది. మదురై, విరుదునగర్‌, నామక్కల్‌, ఈరోడ్‌, కరూర్‌ , పెరంబలూర్‌ జిల్లాల్లో కూడా ఒక మీటరు కంటే ఎక్కువగానే నీటి మట్టం తగ్గింది.

వర్షాలు కురిసినా పెరగని నీటి మట్టం..

2025లో తమిళనాడులో సాధారణం కంటే 12 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అయినప్పటికీ భూగర్భ జలాలు వృద్ధి చెందకపోవడానికి నిపుణులు పలు కారణాలను విశ్లేషిస్తున్నారు. అందులో వర్షాలు కురిసినప్పుడు అతి తక్కువ సమయంలో భారీగా కురవడం వల్ల నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా పోయినట్టు పేర్కొంటున్నారు. వ్యవసాయం , పారిశ్రామిక అవసరాల కోసం బోర్‌వెల్స్‌ ద్వారా భూగర్భ జలాలను పరిమితికి మించి తోడటం కూడా కారణంగా చెబుతున్నారు. పట్టణీకరణ వలన భూమిపై సిమెంట్‌ ప్లాట్‌ఫారాలు పెరిగిపోయి, వర్షపు నీరు భూమిలోకి వెళ్లే మార్గాలు మూసుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వర్షపు నీటిని నిల్వ చేసే చెరువులు, కుంటలు పూడికతో నిండిపోవడం వల్ల నీరు సముద్రం పాలవుతోందని పేర్కొంటున్నారు.

అధికారుల హెచ్చరిక

వేసవి కాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న తరుణంలోనే నీటి మట్టాలు ఇంతలా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే నెలల్లో తాగునీటి కొరత తీవ్రమయ్యే అవకాశం ఉందని, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డెల్టా జిల్లాలు, తీరప్రాంత జిల్లాల్లో మాత్రం నీటి మట్టం ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా, డెల్టా వర ప్రదాయినిమేట్టూరు జలాశయం క్రమంగా అడుగంటుతుండటం కలవరాన్ని రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement