టోల్‌ మోత..! | - | Sakshi
Sakshi News home page

టోల్‌ మోత..!

Mar 24 2026 7:58 AM | Updated on Mar 24 2026 7:58 AM

టోల్‌ మోత..! ● 68 చోట్ల పెంపునకు నిర్ణయం

● 68 చోట్ల పెంపునకు నిర్ణయం

సాక్షి, చైన్నె: తమిళనాడులోని జాతీయ రహదారులను ఉపయోగించే వాహనదారులపై అదనపు భారం పడనుంది. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు టోల్‌ ప్లాజాల వద్ద చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు ఏప్రిల్‌1 నుంచి అమలులోకి రానున్నాయి.

68 టోల్‌ ప్లాజాలలో చార్జీల పెంపు

తమిళనాడులో మొత్తం 6,600 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారులపై 77 టోల్‌ బూత్‌లు ఉండగా, అందులో 68 టోల్‌ ప్లాజాల వద్ద చార్జీలను 3 నుంచి 5 శాతం వరకు పెంచారు. వాహన రకాన్ని బట్టి టోల్‌ రుసుం రూ. 15 నుంచి రూ. 40 వరకు పెరగనుంది. చైన్నె పరిధిలోని సూరపట్టు, వనగరం, మాథూర్‌, చెంగల్పట్టులోని పరానూర్‌ వంటి రద్దీగా ఉండే ప్లాజాల వద్ద చార్జీలు పెరుగుతున్నాయి. విల్లుపురం, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లోని టోల్‌ బూత్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే ఇంధన ధరల పెరుగుదల, గ్యాస్‌ కష్టాలతో రవాణా ఖర్చులు పెరగగా, ఇప్పుడు టోల్‌ చార్జీల పెంపు ప్రజలకు మరింత భారం కానుంది. లారీలు, ట్రక్కుల తదితర భారీ వాహనాలపై అదనపు భారం మూలాన సరుకు రవాణా మరింత తడిసి మోపుడు కానుంది. ఫలితంగా కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని వినియోగదారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

వసూళ్లలో రికార్డు సృష్టించిన

తొప్పూర్‌ టోల్‌ ప్లాజా

గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) తమిళనాడులో టోల్‌ వసూళ్ల ద్వారా రూ.4,300 కోట్లు సమకూరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కృష్ణగిరి జిల్లాలోని తొప్పూర్‌ టోల్‌ ప్లాజా ఒక్కటే అత్యధికంగా రూ. 275 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. టోల్‌ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడానికి , సమయాన్ని ఆదా చేయడానికి ట్రక్కుల కోసం ప్రత్యేక టోల్‌ కార్డులను ప్రవేశపెట్టాలని తమిళనాడు ఇసుక ట్రక్కు యజమానుల సంఘం అధ్యక్షుడు ఎస్‌.యువరాజ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి వడ్డన విధించరాదని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement