వరదరామి చెక్‌పోస్టు నుంచి కారుతో స్మగ్లర్ల దూకుడు తప్పించుకునేందుకు సినీ ఫక్కీలో పరారీ వెంటాడిన అధికారులు పాక్కం వద్ద అదుపుతప్పిన కారు గాయాలతో పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లు, మరో ముగ్గురు పరారీ
తిరుపతి టూ తమిళనాడు
వేలూరు: సినీ ఫక్కీలో పోలీసులు వెంటాడి కారుతో సహా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు పారిపోగా, ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. ఈ సంఘటన గుడియాత్తం సమీపంలోన పాక్కం గ్రామ చెరువు కట్ట వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. తిరుపతి నుంచి కారులో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని అటవీ అధికారులకు సమాచారం అందడంతో ఆంధ్రా సరిహద్దులోని పరదరామి చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేశారు. ఇది గమనించిన ఓ కారు ఆగకుండా మితిమీరిన వేగంతో దూసుకుపోవడంతో అటవీశాఖ అధికారులు కారును వెంబడించారు. సినిమా ఫక్కీలో ముందూ వెనుకా వాహనాలు రయ్..రయ్యిమంటూ దూసుకుపోయాయి. చివరకు తప్పించుకునే ప్రయత్నంలో కారు మరింత వేగంగా వెళ్లడంతో అదుపు తప్పింది. పాక్కం గ్రామం వద్ద చెరువు కట్టపై నుంచి కిందకు దూసుకెళ్లింది. వెంటనే కారులో ఉన్నవారిలో ముగ్గురు దిగి అక్కడ నుంచి పరారయ్యారు. గాయాలపాలైన మరో ఇద్దరు వెళ్లలేక కారులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆంధ్ర అటవీశాఖ అధికారులతోపాటు గుడియాత్తం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన కారులోని నిందితులను ఆస్పత్రికి తరలించారు. కారును తనిఖీ చేస్తే సుమారు 500 కిలోల ఎర్రచందనం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గురైన వ్యక్తులు ఎవరు? కారు నుంచి పరారైన స్మగ్లర్లు ఎవరు? కారు ఎవరిది? ఎర్రచందనాన్ని ఎక్కడి తరలిస్తున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


