సాక్షి, చైన్నె: డీఎంకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం విడియల్ పయనం అద్భుత విజయాలను నమోదు చేసింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, ట్రాన్స్‌జెండర్లు , దివ్యాంగులు కలిసి మొత్తం 897.82 కోట్ల పర్యాయాలు ఉచితంగా ప్రయాణించారని సీఎం స్టాలిన్ స్వయంగా ప్రకటించారు. ద్రవిడ మోడల్ ప్రభుత్వంలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి అని ఆయన తన సామాజిక మాధ్యమం ఎక్స్ పేజీలో పేర్కొన్నారు.
పెరుగుతున్న ప్రయాణాల గణాంకాలు:
సీఎం స్టాలిన్ విడుదల చేసిన వివరాల ప్రకారం, గత ఐదేళ్లలో ఉచిత ప్రయాణాల సంఖ్య నిరంతరం పెరుగుతూ వచ్చిందని వివరించారు. 2021–22: 95.86 కోట్లు, 2022–23: 166.53 కోట్లు, 2023–24: 186.35 కోట్లు, 2024–25: 213.94 కోట్లు,
2025–26 (మార్చి 1 వరకు): 235.14 కోట్లు అంటూ మొత్తం ప్రయాణాలు 897.82 కోట్ల పర్యాయాలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 7,712 ప్రత్యేక బస్సులు ఈ పథకం కింద నడుపుతున్నామని వివరించారు. సురక్షితమైన, ఉచిత ప్రయాణం వల్ల మహిళల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయని, వారు స్వతంత్రంగా ఎదగడానికి ఈ పథకం దోహదపడిందని సీఎం వివరించారు. భారతదేశంలోనే మొదటిసారిగా తమిళనాడులో ప్రారంభమైన ఈ పథకం, తాజాగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో శ్రీద్రవిడ మోడల్ 2.ఓశ్రీ ద్వారా ఈ పథకాన్ని మరింత ఉన్నతీకరిస్తామన్నారు. విడియల్ పయనం అనేది కొత్త భవిష్యత్తు కోసం తాను గతంలో చేసిన మొదటి సంతకం అని, ఇది కేవలం ప్రయాణం మాత్రమే కాదని, , మహిళల పురోగతికి దారితీసే మార్గం్ఙ అని స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు.


