పుదుచ్చేరిలోనూ విజయ్ ఒంటరే
– నేడు అభ్యర్థుల జాబితా
సాక్షి, చైన్నె : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీవీకే అధినేత విజయ్ నిర్ణయించారు. అభ్యర్థుల కసరత్తు పూర్తిచేశారు. ఆదివారం జాబితాను ప్రకటించనున్నారు. వివరాలు.. తమిళనాడులో విజయ్ ఇచ్చిన కూటమి పిలుపునకు పార్టీల నుంచి స్పందన శూన్యం. దీంతో ఆయన ఒంటరిగా ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితులలో పుదుచ్చేరిలో ఎన్‌ఆర్ కాంగ్రెస్ తమతో కలిసి వస్తుందని ఎదురు చూశారు. అయితే ఎన్‌ఆర్‌కాంగ్రెస్ ఎన్‌డీతోనే పయనం సాగించడంతో చివరకు పుదుచ్చేరిలోనూ ఒంటరి పోటీకి విజయ్ సిద్ధమ య్యారు. శనివారం పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక బిజీ లో నిమగ్నమయ్యారు. సోమవారం నామినేషన్ల కు చివరి రోజు కావడంతో ఆదివారం అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు విజయ్ నిర్ణయించినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.
రేపటి నుంచి
సీమాన్ ప్రచార బాట
సాక్షి, చైన్నె : నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ప్రచారానికి రెడీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొంటున్న సీమాన్ ఇప్పటికే 234 నియోజకవర్గాలకు రాష్ట్రంలో అభ్యర్థులను ప్రకటించారు. అలాగే పుదుచ్చేరిలోనూ 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ స్థానాలలో 50 శాతం సీట్లను మహిళకు కేటాయించారు. ఎన్నికల మ్యానిపెస్టోను సైతం ప్రకటించిన సీమాన్ సోమవారం నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. తిరుత్తణిలో తన ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రోజుకు మూడు లేదా నాలుగు నియోజకవర్గాలను కలిపే విధంగా ప్రచార పర్యటనకు ఆయన కార్యాచరణ సిద్ధం చేశారు.
అన్నానగర్: నైల్లె సమీపంలో రోడ్డుపై అడ్డుగా వచ్చిన జింకను బైక్ ఢీ కొనడంతో కళాశాల విద్యార్థి, కాలు జారి కిందపడి విషాదకరంగా మరణించాడు. వివరాలు.. నైల్లె జిల్లా చెరన్‌మాదేవి, అనవరత్నలూరు వీధికి చెందిన మహమ్మద్ అలీ. ఇతని కుమారుడు మహమ్మద్ రియాజ్ (21). ఇతను తిరుచ్చిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బి.కామ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. అతను రంజాన్ పండుగను జరుపుకోవడానికి కొన్ని రోజుల క్రితం తన స్వగ్రామానికి వచ్చాడు. శనివారం ఉదయం, రంజాన్ పండుగ సందర్భంగా మహమ్మద్ రియాజ్ పాతమడైలోని స్నేహితులకు ఖుర్బానీ మాంసం ఇవ్వడానికి మోటార్ సైకిల్ మీద బయలుదేరాడు. ఈ సమయంలో జింక అకస్మాత్తుగా రోడ్డు దాటింది. ఆ సమయంలో, మోటార్ సైకిల్‌పై వెళ్తున్న మహమ్మద్ రియాజ్ జింజను ఢీ కొట్టాడు. దీంతో కిందపడి మరణించాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కోడలను తిట్టిందని అత్త హత్య
వేలూరు: వేలూరు సమీపంలో కోడలను తిట్టిందని ఆమె అత్తను బంధువు హత్య చేశారు. వేలూరు జిల్లా బాలూరు గ్రామానికి చెందిన మునియన్ కూలీ. ఇతని రెండవ భార్య రాజేశ్వరి మృతిచెందడంతో కవితను మూడవ వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రాజేశ్వరి కుమారుడు అభిమన్యు ఆటో నడుపుతున్నాడు. ఇతను చైన్నెకి చెందిన ప్రతిభను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. గత మూడు నెలల క్రితం బాలూరు గ్రామానికి భార్యను తీసుకొచ్చాడు. వ్యతిరేకించిన కవిత తరచూ ప్రతిభతో గొడవపడేది. శుక్రవారం సాయంత్రం అభిమన్యు సొంత పనుల నిమిత్తం బెంగళూరు వెళ్లాడు. ఇంట్లో ఉన్న అత్త కవిత ప్రతిభతో ఘర్షణ పడింది. విషయం తెలిసి అభిమన్యు అదే ప్రాంతంలో నివశిస్తున్న తన తాత చాముండికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడమని చెప్పాడు. ఆ సమయంలో చాముండి, కవిత మధ్య ఘర్షణ పెద్దదైంది. అది చూసి ఆగ్రహించిన చాముండి కత్తితో కవితను నరికాడు. దీంతో కవిత అక్కడికక్కడే మృతిచెందింది. ఉమరాబాద్ పోలీసులు చాముండిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
రంగన్న ఆస్తి రూ.36 కోట్లు
సాక్షి, చైన్నె : పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఆస్తుల విలువ రూ. 36 కోట్లుగా తేలింది. ఇతర మంత్రుల ఆస్తుల వివరాలను సైతం నామినేషన్ ప్రమాణ పత్రం ద్వారా వెలుగులోకి వచ్చాయి. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి , ఇతర కీలక మంత్రులు సమర్పించిన అఫిడవిట్ల ద్వారా వారి ఆస్తుల వివరాలు వెల్లడయ్యాయి. ముఖ్యమంత్రి రంగస్వామి తన నామినేషన్ పత్రాల్లో తన మొత్తం ఆస్తుల విలువ రూ. 36 కోట్లుగా ప్రకటించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆదాయం రూ. 4.60 లక్షలుగా ఉండగా తాజాగా వార్షిక ఆదాయం, 2024–25 నాటికి రూ. 1.93 లక్షలకు తగ్గడం గమనార్హం. నగదు, బ్యాంక్ నిల్వలు ప్రస్తుతం ఆయన వద్ద రూ. 33,339 నగదు ఉండగా, ఇతర బ్యాంకు ఖాతాల్లో కలిపి సుమారు రూ. లక్ష వరకు పొదుపు ఉంది. వాహనాలు , ఆభరణాలు, ఆయన వద్ద రెండు మోటార్ సైకిళ్లు, రెండు కార్లు ఉన్నాయి. అలాగే రూ. 21.25 లక్షల విలువైన ముత్యాల గొలుసుతో కూడిన ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. తట్టంజవాడి ప్రాంతంలో సుమారు రూ. 27.78 కోట్ల విలువైన భూమి , భవనాలు ఉన్నాయి. ఆయనకు రూ. 35 లక్షల అప్పు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. విశేషమేమిటంటే, ఆయనపై ఎటువంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేకపోవడం గమనార్హం.


