సాక్షి, చైన్నె: ఎన్నికల భద్రతను కట్టుదిట్టంచేస్తూ, మరింతగా వాహన తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక పరిశీలకులు రంగంలోకి దిగారు. పోలీసు అధికారులు, కలెక్టర్లతో కేంద్ర ఎన్నిక కమిషన్ ప్రత్యేక పరిశీలకుడు ప్రతాప్ సింగ్ శనివారం చైన్నెలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను అర్చనా పట్నాయక్ నేతృత్వంలోని అధికారులు వేగవంతం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్‌లు దూసుకెళ్తున్నాయి. తమకు ఫిర్యాదు వచ్చినా, అనుమానం వచ్చినా ఈ స్క్వాడ్ ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. మంత్రుల వాహనాలు సైతం వదలి పెట్టడం లేదు. ఈ పరిస్థితులలో ఇంకా చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలకులు రంగంలోకి దిగారు.
జిల్లాల వారీగా..
ఎన్నికల భద్రతా పర్యవేక్షణ పరిశీలకుడు ప్రతాప్ సింగ్, పోలీసు సమన్వయ పరిశీలకుడు ప్రవీణ్‌కుమార్, అర్చనా పట్నాయక్‌లు శనివారం సచివాలయంలో తిరువళ్లూరు, చైన్నె, కాంచీపురం, చెంగల్పట్టు తదితర జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు, కలెక్టర్లు తదితర అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాల వారీగా పరిస్థితులను అధ్యయనం చేశారు. నియోజకవర్గాలలో ప్రత్యేకచెక్ పోస్టుల ఏర్పాటు, వాహన తనిఖీలు ముమ్మరం చేయించడం, తాయిలాల పంపిణి కట్టడి దిశగా మరింత దూకుడుగా ముందుకెళ్లే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భద్రతా విషయంలో ఏ ఒక్కరికి తలొగ్గాల్సిన అవశ్యం లేదని, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. తాజాగా 50 కంపెనీల పారా మిలటరీ తమిళనాడులోకి వచ్చిందని, మరో 250 కంపెనీల రావాల్సి ఉందని, మరి కొద్ది రోజులలో ఇక్కడకు ఈ బృందాలు చేరుకుంటాయని అధికారులు వివరించారు.


