బీహెచ్‌ఐఎం యాప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ!
సాక్షి, చైన్నె: డిజిటల్ చెల్లింపుల బీహెచ్‌ఐఎం యాప్ అభివృద్ధిలో భాగంగా భారత మాజీ క్రికెటర్, మహేంద్ర సింగ్ ధోనీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ గురువారం స్థానికంగా ప్రకటించింది. ఈ విషయంగా ఎన్‌బీఎస్‌ఎల్ ఎండీ లలిత నటరాజ్ మాట్లాడుతూ నమ్మకం, నిలకడ, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ధోనీ రాకతో, దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులపై వినియోగదారుల్లో మరింత భరోసా పెరుగుతుందని భావిస్తున్నట్టు వివరించారు. బీహెచ్‌ఐఎం యాప్ తన పదేళ్ల ప్రస్థానానికి చేరువవుతున్న తరుణంలో ధోనీ వంటి దిగ్గజం తోడవ్వడం వ్యూహాత్మక మార్పుగా కనిపిస్తోందన్నారు. ధోనీ ఎలాగైతే ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండి విజయాన్ని అందిస్తారో ఈ యాప్ కూడా అంతే భద్రతతో వేగవంతమైన సేవలను అందిస్తుందని వివరించారు. ఈ యాప్ ప్రస్తుతం 15కి పైగా ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా తక్కువ ఇంటర్నెట్ సదుపాయం ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యాప్ సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దామని వివరించారు. ధోని మాట్లాడుతూ డిజిటల్ చెల్లింపులను సామాన్యులకు సులభతరం చేయాలనే ఈ సంస్థ లక్ష్యం తనకు బాగా నచ్చినట్టు పేర్కొన్నారు.. దేశం డిజిటల్ దిశగా అడుగులు వేస్తున్న సమయంలో వినియోగదారులు సురక్షితంగా ఆత్మవిశ్వాసంతో లావాదేవీలు జరపడం చాలా అవసరమని వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్త అవసరాలను తీర్చే ఈ యాప్‌తో తాను సైతం భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు.
21 సవర్ల నగలు,
రూ 20 వేలు నగదు చోరీ
– ఇద్దరు అరెస్ట్
తిరువొత్తియూరు: చైన్నె పెరంబూరు ప్రాంతంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఇంటిలో 21 సవర్లు, రూ. 20 వేలు నగదు చోరీ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె పెరవల్లూరు పెరియార్ నగర్‌కు చెందిన అశోక్ కుమార్ (72), తమిళ అభివద్ధి శాఖలో పనిచేసి గత ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందారు. ఆయన పెరియార్ నగర్ మొదటి వీధిలో ఉన్న తన ఇంటిలో నివసిస్తున్నారు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు, ఒకరు ముంబైలో, మరొకరు దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఈక్రమంలో గత 14వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో అశోక్ కుమార్ తన భార్యతో కలిసి వేళచ్చేరిలో ఉన్న తన తమ్ముడు విజయ్ కుమార్ ఇంటికి వెళ్లి మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంటి తలుపులు తెరిచి వున్నా యి. సోదా చేయగా బీరువా లో వున్న 21 సవర్ల బంగారు నగలు, రూ. 20 వేల నగదు కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరవల్లూరు పెరవల్లూరు క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కళ్యాణ్ కుమార్ విచారణ చేపట్టారు. విచారణ తర్వాత పోలీసులు గురువారం ఉదయం తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలూకా పెరుమాళ్ కోయిల్ వీధికి చెందిన జగదీసన్ (27), అదే ప్రాంతానికి చెందిన దీనా అలియాస్ మురుగన్ (27) అనే ఇద్దరిని అరెస్టు చేశారు. అశోక్ కుమార్ ఇంట్లో దొంగిలించిన21 సవర్ల బంగారు నగలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
వ్యాపారి హత్య ముగ్గురి అరెస్టు
తిరువొత్తియూరు: పోలూరు వద్ద మరైమలై నగర్ వ్యాపారిని హత్య చేసి పాతి పెట్టిన భార్యా,భర్తలు సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. చెంగల్పట్టు మరైమలై నగర్‌కు చెందిన శంకర్ కోళ్ల వ్యాపారి. అతను గత 10వ తేదీన మొపెడ్‌పై కోళ్లను ఎక్కించుకుని వ్యాపారం కోసం తిరువణ్ణామలై జిల్లా, పోలూరు పక్కన ఉన్న మట్టపిరయూర్ గ్రామానికి వచ్చాడు. అదే ప్రాంతానికి చెందిన ఏలుమలై, అతని భార్య శక్తి, కొడుకు శక్తివేల్‌తో శంకర్ కోళ్ల వ్యాపారంలో నిమగ్నం అయ్యారు. ఆ సమయంలో నగదు లావాదేవీలలో వారికి గొడవ జరిగింది. దీంతో కోపంతో ముగ్గురు కలిసి శంకర్‌పై దాడి చేశారు ఇందులో శంకర్ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. దీంతో షాక్ తిన్న ముగ్గురు కలిసి కోళ్ల వ్యాపారి శవాన్ని దాచిపెట్టడానికి పోలూరు దగ్గర ఉన్న రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ శంకర్ శవాన్ని పూడ్చిపెట్టారు. కాగా కోళ్ల వ్యాపారి అదృశ్యంపై అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలూరు పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. అనుమానంతో ఏలుమలై, శక్తి, శక్తివేల్‌ను విచారించారు. అందులో కోళ్ల వ్యాపారితో గొడవపడినట్లు, కోపంతో అతన్ని కొట్టి చంపినట్లు తెలిసింది. దీంతో శవాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశానికి తీసుకెళ్లారు.అక్కడ పూడ్చిపెట్టిన కోళ్ల వ్యాపారి శవాన్ని పోలీసులు వెలికితీసి పోస్టుమా ర్టం కోసం పోలూరు ఆసుపత్రికి పంపించారు. కోళ్ల వ్యాపారిని చంపిన భార్యాభర్తలు, కొడుకును పోలీసులు అరెస్టు చేశారు.


