● సీమాన్ మ్యానిఫెస్టో
● ప్రేమపూర్వకంగా ఉండే నియంతృత్వ పాలన లక్ష్యం ● ఐదు రాజధానుల విధానం: ప్రస్తుతం చైన్నెలోనే విద్య, వైద్యం, ఉపాధి అన్నీ కేంద్రీకృతమై ఉండటంతో నగరంపై ఒత్తిడి పెరుగుతోందని, దీనిని నివారించడానికి పరిపాలనను వికేంద్రీకరిస్తామని ప్రకటించారు. ఆమేరకు తిరుచ్చిని ప్రధాన పరిపాలనా రాజధానిగా, చైన్నెను సాంకేతిక రాజధానిగా, కోయంబత్తూరును పారిశ్రామిక , వాణిజ్య రాజధానిగా, మధురైను భాష, కళ, సాంస్కృతిక రాజధానిగా, కన్యాకుమారిని తమిళ తత్వశాస్త్ర రాజధానిగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
● ప్రత్యేకంగా మహిళా నియోజకవర్గాలు : స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, అసెంబ్లీ పార్లమెంటులో లేదని పేర్కొంటూ, మహిళల కోసం ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించేలా పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
● స్వయంప్రతిపత్తి – కేంద్రంలో సమాఖ్య : భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం కేంద్రానికే ఎక్కువ అధికారాలు ఉన్నాయని నామ్ తమిళర్ పార్టీ వివరించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని రంగాల్లో చట్టాలు చేసే అధికారం ఉండాలని, రాజ్యాంగంలో తగిన మార్పుల కోసం కృషి చేస్తామని ‘రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి, కేంద్రంలో సమాఖ్య‘ అనే నినాదాన్ని గట్టిగా వినిపిస్తామని వివరించారు.
● తమిళులకే ప్రాధాన్యత : తమిళనాడులో తమిళులకు రిజర్వేషన్లలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టంచేశారు. ఇతర భాషా మాట్లాడే రాష్ట్రాల్లో తమిళులకు ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుందో, అదే ప్రాతిపదికన తమిళనాడులోని ఇతర భాషా మైనారిటీలకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
● వ్యవసాయం, పశుపోషణకు ’ప్రభుత్వ ఉద్యోగ’ హోదా: పారిశ్రామిక ఉత్పత్తుల ధరలను తయారీదారులే నిర్ణయించినట్లుగా, వ్యవసాయ ఉత్పత్తుల ధరలను రైతులే నిర్ణయించే హక్కును కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, గొర్రెలు, మేకలు, పశువుల పెంపకాన్ని కేవలం జీవనోపాధిగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తిస్తామని, రంగంలో పనిచేసే వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు.
సాక్షి, చైన్నె: అధికారంలోకి వస్తే రాష్ట్రానికి 5 రాజధానులను ఏర్పాటు చేస్తామని నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ ప్రకటించారు. ప్రేమ పూర్వకంగా ఉండే నియంతృత్వ పాలన దిశగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికలలోనూ ఒంటరిగా పోటీ చేస్తూ వస్తున్న నామ్ తమిళర్ కట్చి లోక్‌సభ ఎన్నికలలో ఎనిమిది శాతానికి పైగా ఓట్లను సాధించి కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపును సొంతం చేసుకుంది. తాజా అసెంబ్లీ ఎన్నికలలోనూ తమిళనాడుతో పాటూ పుదుచ్చేరిలో ఒంటరిగా మళ్లీ పోటీకి సిద్ధమైంది. అన్ని పార్టీల కంటే ముందుగా రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి, ఎన్నికల ప్రచారాన్నిసీమాన్ వేగవంతం చేశారు. రాష్ట్రంతో పాటుగా పుదుచ్చేరిలో 50 శాతం సీట్లను మహిళలకు కేటాయించిన సీమాన్, గురువారం చైన్నెలో అందరి కంటే ముందుగా పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. తమ పాలన అన్నది ‘ప్రేమపూర్వకమైన నియంతృత్వంగా‘ ఉంటుందని సీమాన్ ప్రకటించారు. సర్వమత సమ్మేళనాన్ని చాటే విధంగా ముగ్గురు మహిళల ద్వారా మ్యానిపెస్టోను విడుదల చేయించారు.
మ్యానిఫెస్టోలోని ముఖ్యఅంశాలు
ఇతర ముఖ్యాంశాలు కొన్ని
చైన్నెలో సుప్రీం కోర్టు శాఖను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రత్యేక దళాలను ఏర్పాటు చేస్తాం. తాటి చెట్టును తమిళ జాతీయ వృక్షంగా ప్రకటించి, జలవనరుల చుట్టూ తాటి వనాలను పెంచుతాం. ప్రస్తుత స్వార్థపూరిత పాలనకు భిన్నంగా, నిస్వార్థమైన ‘పేమపూర్వక నియంతృత్వ పాలన అందిస్తామని ప్రకటించారు.