మద్రాసు వర్సిటీలో ఉగాది సంబరాలు | - | Sakshi
Sakshi News home page

మద్రాసు వర్సిటీలో ఉగాది సంబరాలు

Mar 19 2026 7:51 AM | Updated on Mar 19 2026 7:51 AM

కొరుక్కుపేట: మద్రాసు వర్సిటీ తెలుగుశాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. తెలుగుశాఖ అతిథి ఉపన్యాసకులు డా. పాండురంగం కాళియప్ప, అరుణ ఆలపించి ప్రారంభించారు. అధ్యక్షుడు ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ తెలుగువారి తొలి పండుగను తెలుగు వారి సమక్షంలో తెలుగుశాఖలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అద్దేపల్లి పురుషోత్తం, డా. ఏ.వి. శివకుమారి మాట్లాడుతూ మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ మొదటగా ఉగాది కార్యక్రమం నిర్వహించిందన్నారు. డా. జొన్నలగడ్డ వెంకటరమణ ఉగాది విశిష్టతలను తెలియజేశారు. పెద్దోజు నరేష్‌ పంచాగ పఠనం గావించారు. ఆ తర్వాత కూచిపూడి నృత్యాన్ని డా.ఆర్‌. శివకుమార్‌ ప్రదర్శించి శ్రోతలను అలరించారు.

రెండు పుస్తకాల ఆవిష్కరణ

అనంతరం రెండు పుస్తకాలను తమ్మినేని బాబు ఆవిష్కరించారు. అందులో మొదటగా డా. ఆముక్తమాల్యద రచించిన ‘పసిడి మనస్సు’ని డా. జి. లలిత తొలి ప్రతి స్వీకరించగా, సరోజినీ ప్రేమచంద్‌ పుస్తకాన్ని సమీక్షించారు. రెండవ పుస్తకం డా. మాదా శంకరబాబు రచించిన శ్రీవ్యాస ప్రభావతిశ్రీని డాక్టర్‌ మామిడి మురళి సమీక్షించారు. ఆచార్య విస్తాలి శంకరరావుగారి ఉగాది పురస్కారాన్ని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, హిందీ శాఖ ఆచార్యులు డా. జి.వి. రత్నాకర్‌కు ఆచార్య విస్తాలి శంకరరావు గారి అందించారు. ఉగాది కవిసమ్మేళన సభకు డా. చవితి రాధాకష్ణ స్వాగతం పలకగా, అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు ఉగాది కవితల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీమతి కాశీ సోమయాజుల రమణి ఉగాది తెలుగువారికి ఆది పండుగని అన్నారు. కవిసమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి మొత్తం 75 మంది తమ కవితలను చదివారు. ఆచార్య సి.ఎం.కె.రెడ్డి, శ్రీ కాకుటూరు అనిల్‌ కుమార్‌ రెడ్డి, ఆచార్య ఎల్‌.బి. శంకరరావు, మంగళా కందూర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement