ప్రభుత్వం ఇచ్చిన రూ. 5 వేలు వెనక్కి..!
సాక్షి, చైన్నె: తన భార్యకు ప్రభుత్వం ఖాతాలో వేసిన రూ. 5 వేలును మదురైకు చెందిన సామాజిక కార్యకర్త శంకర పాండివెనక్కు ఇచ్చేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి మనీ ఆర్డర్ చేశాడు. మగళిర్ ఉరిమై తిట్టం (మహిళా హక్కు పథకం) రూ. 1000 నగదును , ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు ముందుగానే ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. దీనితో పాటూ వేసవి కాలంలో ప్రత్యేకం అని మరో రూ. 2 వేలు అందజేశారు. ఈ మొత్తాన్ని అందుకున్న మహిళలు అత్యధిక శాతం మంది సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే, ఈ రూ. 5 వేలు తమకు వద్దంటూ శంకర పాండి వెనక్కి పంపించడం గమనార్హం. అదే సమయంలో చైన్నెకు చెందిన న్యాయవాది ఒకరు , ఒకే రోజు 1.31 కోట్ల మంది ఖాతాలో రూ. 5 వేలు చొప్పున జమ చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇంత పెద్దమొత్తం ప్రభుత్వం ఏ ప్రాతిపదికన అందజేసిందని, ఈ మొత్తం ఒకే సారి పంపిణీ చేయడం కారణంగా, ఎదురయ్యే ఆర్థిక భారం తదితర పరిస్థితులను గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంలో పెద్ద స్కాం ఉండేందుకు అవకాశం ఉందని, దీనిపై విచారణ చేపట్టాలంటూ పలు దర్యాప్తు సంస్థలకు ఆయన లేఖ పంపించడం గమనార్హం.
డ్రోన్ ఎందుకు ఎగురవేశావ్?
– నిందితుడికి పోలీసుల ప్రశ్నల వర్షం
కొరుక్కుపేట: అమిత్ షా బహిరంగ సభలో నిషేదాజ్ఞలు ఉల్లంఘించి డ్రోన్ ఎందుకు ఎగిరింది? అంటూ పట్టుబడిన వ్యక్తిని పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. వివరాలు.. శనివారం పుదుచ్చేరిలోని కారైకల్‌లో భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇందులో పాల్గొన్నారు. బహిరంగ సభ జరిగిన ప్రదేశంలో కేంద్ర భద్రతా దళాలు విధుల్లో ఉన్నాయి. బహిరంగ సభ జరిగిన ప్రదేశం నుండి దాదాపు కిలోమీటరు దూరంలో డ్రోన్ ఎగరడాన్ని జిల్లా యంత్రాంగం నిషేధించింది. ఈ పరిస్థితుల్లో అమిత్ షా ప్రసంగిస్తుండగా బహిరంగ సభ వేదిక నుండి దాదాపు 500 మీటర్ల దూరం డ్రోన్ ఎగిరింది. దీంతో సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికుడు యాంటీ–డ్రోన్ టెక్నాలజీ సహాయంతో డ్రోన్‌ను కూల్చివేశారు. దీనిపై కారైకల్ పోలీస్ సిటీ ఇన్‌స్పెక్టర్ పురుషోత్తమన్ నేతత్వంలోని పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు నిర్వహించారు. డ్రోన్ ఎగరవేసిన వ్యక్తి తిరునల్లార్‌కు చెందిన లోకేష్ (25) అని తేలింది. అతను కారైకల్‌లోని భారతీయార్ వీధిలో డ్రోన్ మరమ్మతు దుకాణం , యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నట్లు వెల్లడైంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఒక బహిరంగ సభను రికార్డ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడానికి డ్రోన్‌ను ఉపయోగించినట్లుసమాచారం. అయినప్పటికీ, ఆయనను ఇంకా ప్రశ్నిస్తున్నారు.
ఓటరు జాబితా విడుదలలో జాప్యం
సాక్షి, చైన్నె: తుది ఓటరు జాబితా తయారీలో జాప్యం తప్పలేదు. దీంతో ముందుగా నిర్ణయించినట్టుగా ఈనెల 17వ తేదీన కాకుండా 23వ తేదీన తుది జాబితా విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ ప్రకటించారు. వివరాలు.. రాష్ట్రంలో గత ఏడాది చివర్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో సుమారు 97 లక్షల మంది పేర్లు తొలగించారు. మాదిరి ఓటరు జాబితాలో పేర్లు లేని వాళ్లు మళ్లీ తమ పేర్లను నమోదు చేసుకునేందుకు తొలుత నెల రోజులు అవకాశం కల్పించారు. తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాలతో మరో పది రోజులు కేటాయించారు. అదే సమయంలో ఎన్నికల ఏర్పాట్ల పనులను సైతం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ నేతృత్వంలోని అధికారులు వేగవంతం చేశారు. కేంద్రం ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్ల బృందం సైతం చైన్నెకు వచ్చి ఏర్పాట్లను పరిశీలించి వెళ్లింది. ఈ పరిస్థితులలో 34.73 లక్షల మంది పేర్ల నమోదుకు దరఖాస్తులు చేసుకున్నారు. వీటన్నింటినీ పరిశీలించి ముందుగా నిర్ణయించిన మేరకు ఈనెల 17వ తేదిన తుది ఓటరు జాబితా విడుదలకు అధికారులు కసరత్తులు చేపట్టారు. అయితే జాప్యం తప్పలేదు. ఈనెల 10వ తేదీ వరకు నమోదు ప్రక్రియ సాగిన దృష్ట్యా, వాటిని పరిశీలించి తుది ఓటరు జాబితా విడుదలకు మరింత సమయం పట్టక తప్పలేదు. దీంతో ఈనెల 17వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేయడం లేదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తుది జాబితా ఈనెల 23న వెలువడుతుందని ప్రకటించారు.


