మంచి కంటెంట్ చిత్రాలకే ఆదరణ
తమిళసినిమా: ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ కొంత గ్యాప్ తర్వాత తాజాగా నిర్మించిన చిత్రం ఫోర్ ఇడియట్స్. దీనికి డా.ఎం. శ్రీవాత్సవ్, ఎం.గోకుల్‌కృష్ణన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీకే.మురుగేశన్, జ్యో. ఏఎన్.సెల్వరాజ్ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సజోసుందర్ మురుగేశన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అదేవిధంగా పుగళ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఇందులో నయన్ నాయకిగా నటిస్తున్నారు. సుభాష్ మునిరత్నం సంగీతాన్ని, యుకే.సెంథిల్‌కుమార్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం చైన్నెలోని కమల థియేటర్లో నిర్వహించారు. పుగళ్ మాట్లాడుతూ చైన్నె, వడపళనిలో టూవీలర్, కారు సర్వీసింగ్‌లో పనిచేస్తున్న తన గెటప్, క్యారెక్టర్ చూసిన ఒక మిత్రుడు నువ్వు సినిమాల్లో నటించవచ్చుగా అని చెప్పాడు. దీంతో విజయ్ టీవీలో అవకాశం కల్పించారని తెలిపారు. అక్కడ గుర్తింపు తెచ్చుకుని, సినిమాల్లో హాస్య నటుడిగా పరిచయం అయ్యానన్నారు. ఈ చిత్రంలో ఒక పాట కూడా పాడినట్లు చెప్పారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రం వినోదంతో కూడిన థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. తిరుప్పూర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ చిన్న, పెద్ద తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న కథా చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. అలా మంచి కంటెంట్ కలిగిన చిత్రంగా ఫోర్ ఇడియట్స్ ఉంటుందని చెప్పారు.


