ఎన్నికల బహిష్కరణకూ సిద్ధం
సాక్షి, చైన్నె : పుదుచ్చేరికి రాష్ట్రహోదా లక్ష్యంగా ఢిల్లీ వెళ్లి పోరాడేందుకు రెడీ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగస్వామి ప్రకటించారు. అవసరం అయితే, ఎన్నికలను బహిష్కరించేందుకూ వెనుకాడబోమని వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలన్న నినాదం గత కొన్నేళ్లుగా మిన్నంటుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మార్గాలు గత పాలకులు, తాజాగా అధికారంలో ఉన్న ఎన్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం సైతం అసెంబ్లీలో రాష్ట్ర హోదా కోసం పఏటా తీర్మానం చేస్తూ కేంద్రానికి పంపిస్తూ వస్తున్నది. అయితే, కేంద్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాడలు ఉన్నాయి. ఇందులో పుదుచ్చేరిలో 22 ఉండగా, కారైక్కాల్, మాగే, యానంలలో మిగిలినవి ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున పాలక ప్రభుత్వం ఈ సంవత్సరం పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేకపోతుంది. దృ ష్ట్యా, ప్రస్తుతానికి మధ్యంతర బడ్జెట్‌ను మాత్రమే సమర్పించవచ్చు. గురువారం అసెంబ్లీలో ఆ రాష్ట్రముఖ్యమంత్రి రంగస్వామి మధ్యంతర బడ్జెట్‌ను దాఖలు చేశారు.ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి రంగ స్వామి పర్యవేక్షిస్తున్న దృష్ట్యా, ఆయనే సమగ్ర వివరాలను అసెంబ్లీకి వివరించారు. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు మూడు నెలలకు గాను బడ్జెట్‌లోరూ. 5,396 కోట్ల వ్యయం కేటాయించారు. ముందుగా ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ , మాజీ ఎమ్మెల్యే సుబ్బ రాయన్, జస్టిస్ డేవిడ్ ఆరుస్వామి మృతికి సంతాపం తెలియజేశారు.
రాష్ట్ర హోదాపై రచ్చ
ఈ సందర్భంగా పుదుచ్చేరికి ఏదీ రాష్ట్ర హోదా అంటూ ప్రతి పక్షం, స్వతంత్ర సభ్యులు నినాదాలు అందుకన్నారు. ప్రతిపక్ష నాయకుడు శివ, ‘మనం ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర హోదా కోసం పోరాడకూడదని తమరు అన్నారే, మరీ ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు. రాష్ట్ర హోదా గురించి తమరు మర్చిపోయారా?‘ అని నిలదీశారు. దీనికి ముఖ్యమంత్రి రంగస్వామి స్పందిస్తూ, ‘ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర హోదా కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని, ప్రతిపక్ష పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయా?‘ అని సవాల్ చేశారు. దీంతో సభలో వాగ్వివాదాలు హోరెత్తాయి. రంగస్వామిని నిలదీస్తూ ప్రతి పక్షాలు వ్యాఖ్యల తూటాలను పేల్చాయి. రాష్ట్ర హోదా కోసం ఎన్నికలు బహిష్కరించేందుకు సిద్ధమా..? అని నిలదీయగా, సిద్ధం అంటూ ఆయన సమాధానం ఇవ్వగం గమానార్హం. అధికార, ప్రతి పక్ష సభ్యులు వ్యాఖ్యల తూటాల మధ్య సభలో మధ్యంత బడ్జెట్‌ను దాఖలు చేశారు.


