పరిశోధన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి
వేలూరు: డిగ్రీలు సాధించిన విద్యార్థులు ఉన్నత విద్యలో పరిశోధన విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ అన్నారు. వేలూరు ఊరీస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 41వ స్నాతకోత్సవం కళాశాల కార్యదర్శి, సీఎస్‌ఐ డయాసీస్ బిషఫ్ శర్మ నిత్యానందం అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన చాన్స్‌లర్ ప్రసంగించారు. ప్రస్తుతం యూజీ, పీజీలు పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలు సాధించడంతోనే మీ విద్య ముగిసి పోయిందనుకోకుండా ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు. ఈ కళాశాలలో చదివిన వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎంత ఉన్నత స్థానాలకు చేరుకున్నా చదివిన కళాశాలను, తల్లిదండ్రులను మరవకుండా ఉండాలన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా మనం దేశం కోసం ఏమి చేశామని ప్రశ్నించుకోవాలన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో ప్రయత్నిస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చన్నారు. అనంతరం డిగ్రీ పట్టాలను అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ ఆనీ కమల, కన్వీనర్ తెరడ్ రాజ్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


