క్లుప్తంగా
జీతం అడిగాడని దాడి
అన్నానగర్: ఇంట్లో పనిచేసినందుకు జీతం అడగడంతో యజమాని దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతిచెందాడని అతని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరువెర్కాడ్‌లోని సెల్వగణపతి నగర్‌కు చెందిన పచ్చముత్తు (70) దినసరి కూలీ. ఇతను పక్క వీధిలో నివసించే శరవణన్ (45) ఇంట్లో పనిచేసేవాడు. కానీ శరవణన్ హామీ ఇచ్చిన విధంగా జీతాలు చెల్లించలేదని తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో శరవణన్ పచ్చముత్తుపై దాడి చేశాడు. ఘటనలో గాయపడిన పచ్చముత్తు, కీల్పాకం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ స్థితిలో, అతను సోమవారం అనారోగ్యానికి గురై మృతిచెందాడు. తిరువేర్కాడు పోలీసులు పచ్చముత్తు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. శరవణన్ ఆడి చేయడం వల్లే తన తండ్రి చనిపోయాడని పచ్చముత్తు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరువెర్కాడు పోలీసులు శరవణన్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విషపురుగు కరిచి బాలిక మృతి
అన్నానగర్: విషపురుగు కరిచి ఓ బాలిక మృతిచెందింది. నమక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్ సమీపంలోని కుమారమంగళం పంచాయతీ యూనియన్‌లోని మిడిల్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలను సోమవారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన రిహార్సల్ పాఠశాల సమీపంలోని ఒక ప్రైవేట్ హాలులో జరిగింది. ఇందులో చాలా మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే కుమారమంగళం కౌండంపాలైయంకు చెందిన మాధేశ్వరన్–ధనలక్ష్మీ దంపతుల కుమార్తె రక్షిత (9) కూడా ఆర్ట్ ప్రోగ్రామ్ రిహార్సల్‌లో పాల్గొంది. రక్షిత 3వ తరగతి చదువుతోంది. రిహార్సల్ సమయంలో రక్షిత అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది. వెంటనే నామక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ రక్షిత మంగళవారం మృతిచెందింది. అంతుముందు రక్షిత తన నుదిటిపై పురుగు కుట్టిందని టీచర్‌కు చెప్పింది. విషపూరిత పురుగు కుట్టడం వల్లే చనిపోయి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాలిక మృతి కారణంగా కార్యక్రమం రద్దు చేశారు.
ఆటోడ్రైవర్ దారుణ హత్య
అన్నానగర్: మదురైలో ఓ ఆటోడ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. మదురైలోని జైహింద్‌పురంలోని జీవానగర్‌కు చెందిన రమేష్ (46) ఆటోడ్రైవర్. ఇతని భార్య ప్రియ (29). వీరికి ఇద్దరు పిల్లలు. ప్రియ పెట్రోల్ బంకులో పనిచేస్తుంది. ఈమె భర్త నుంచి విడిపోయింది. ఈక్రమంలో శివకాశి సమీపంలోని పుదుకోట్టై గ్రామానికి చెందిన శంకర్ (27)తో పిల్లలతో కలసి పుదుకోట్టైలో ఒక గదిని తీసుకుని ఉంటోంది. ఇది తెలిసి రమేష్ సోమవారం రాత్రి చెంగల్పట్టుకు చెందిన తన స్నేహితుడు బాలాజీ (31)తో కలిసి పుదుకోట్టై వెళ్లి శంకర్‌ను కలసి, తన భార్య, పిల్లలను పంపించాలని వేడుకున్నాడు. ఆ సమయంలో శంకర్‌కు మద్దతుగా ముత్తుపాండి(34), మణిశంకర్(27), రాజేష్, కలసి రమేష్‌పై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రమేష్ విరుదునగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మృతిచెందాడు. పోలీసులు దాడి చేసిన ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న రాజేష్ కోసం గాలిస్తున్నారు.
ఎన్‌ఐటీ–తిరుచ్చితో ఎన్‌ఎల్‌సీ ఒప్పందం
కొరుక్కుపేట: మైనింగ్ టెక్నాలజీలో అధునాతన పరిశోధన, అభివృద్ధి సహకారం కోసం ఎన్‌ఐటీ–తిరుచ్చితో ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఎన్‌ఎల్‌సీ సీఎండీ ప్రసన్నకుమార్ మోటుపల్లి, ఎన్‌ఐటీ–తిరుచ్చి ప్రతినిధులతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ నైవేలిలోని ఎన్‌ఎల్‌సీఐఎల్ అంతర్గత పరిశోధన అభివృద్ధి కేంద్రమైన సెంటర్ ఫర్ అప్‌లైడ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (కార్డ్) వద్ద కార్డ్ సైనేజ్ వాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. డెవలప్‌మెంట్ ఆఫ్ న్యూ మెటీరియల్ ఫర్ బక్కెట్ వీల్ టీత్ అండ్ ఇట్స్‌లైఫ్ ఇంప్రూమెంట్ అనే ప్రాజెక్టు కోసం ఒప్పందం చేసుకున్నామని అన్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.50.73 లక్షలని అన్నారు.
పార్థసారథి ఆలయంలో శుద్ధీకరణ పనులు
తిరువొత్తియూరు: చైన్నె అంబత్తూరు ప్రధాన కార్యాలయంగా 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న హిందూ దేవాలయాల శుభ్రతకు దైవసేవా మండలి 302 శుద్ధీకరణ పనులు తిరువల్లిక్కేణి పార్థసారథి ఆలయంలో ప్రారంభించారు. మొదటి కార్యక్రమంగా పరిశుభ్రత సంరక్షణపై అవగాహన ఊరేగింపు నిర్వహించారు. ఆ సమయంలో పన్నీరు తిరుమురైనాధర్‌ను భుజాలపై మోసుకుని, తిరుకై ్కలాయ వాద్యాలు మోగుతుండగా, ఆడియార్లు (భక్తులు) అవగాహన బ్యానర్లను చేతబూని మాడవీధుల్లో ర్యాలీగా వచ్చారు. ఈ ఊరేగింపులో ప్లాస్టిక్ నిషేధాన్ని నొక్కిచెబుతూ ప్రజలకు గుడ్డ సంచులు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటారు. ఈ ఆలయంలో వచ్చే వారం జరగనున్న తెప్పోత్సవాన్ని పురష్కరించుకొని భక్తులు కోనేరును శుభ్రపరిచే పనిలో నిమగ్నమయ్యారు. ఆలయం లోపల కూడా శుభ్రపరిచే పనులు జరిగాయి. సాయంత్రం తిరుమురైపారాయణం చేసి ఆలయ ప్రాంగణంలో మంత్రాన్ని జపిస్తూ ప్రపంచ శ్రేయస్సు కోసం సామూహిక ప్రార్థనలు చేశారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.గణేషన్ ఏర్పాట్లు చేశారు. సంస్థ శుద్ధీకరణ పనులు మీంజూర్ ఏకాంబరనాథర్, వరదరాజ పెరుమాళ్ ఆలయాల్లో జరగనున్నాయి.


