కాలానుగుణంగా మారాలి..! | - | Sakshi
Sakshi News home page

కాలానుగుణంగా మారాలి..!

Feb 10 2026 7:32 AM | Updated on Feb 10 2026 7:32 AM

కాలానుగుణంగా మారాలి..!

కాలానుగుణంగా మారాలి..!

తమిళసినిమా: ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ ఇటీవల డ్యూడ్‌ చిత్రంలో హీరోయిన్‌ తండ్రిగా నటించి ఆ చిత్ర సక్సెస్‌లో భాగం అయ్యారు. తాజాగా ఈయన నటించిన చిత్రం యాళి. ఇందులోనూ శరత్‌కుమార్‌ కథానాయకికి తండ్రిగా నటించడం విశేషం. అయితే ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్రను పోషించారు. నటుడు ఇంద్రజిత్‌ జగజిత్‌, దేవిక సతీష్‌ యువ జంటగా నటించిన ఈ చిత్రంలో నటుడు వైయాపురి, శ్రీజిత్‌ రవి, మైథిలి సత్యరాజ్‌,బిర్లబోస్‌, తామరైసెల్వి, సర్జిన్‌,బిజూ మవునికల్‌ వర్గీస్‌, టీనా బాటియా, నిఖిల్‌ మురుగన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 888 ప్రొడక్షన్స్‌, సెల్యులాయిడ్‌ క్రియేషన్స్‌ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి మాధవ్‌ రామదాసన్‌ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న యాళి చిత్రం ఈ నెల 27వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధం అయ్యింది. ఈ సందర్భంగా సోమవారం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు శరత్‌కుమార్‌ మాట్లాడుతూ సముద్రం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ఇదని చెప్పారు. ఒక ఆధునిక పడవలో అధిక భాగం షూటింగ్‌ను నిర్వహించారని చెప్పారు. ఈ చిత్ర కథను దర్శకుడు చెప్పినప్పుడు దీన్ని చిత్రంగా ఎలా మలుస్తారు అన్న ఆసక్తి కలిగిందన్నారు. అయితే ఒక పెద్ద బోట్‌ సెట్‌ వేసి సముద్రంలో అధిక భాగం చిత్రీకరించారని చెప్పారు. ఇందులో నటి దేవిక సతీష్‌కు తాను తండ్రిగా నటించానని, ఆమె కొన్ని సన్నివేశాల్లో రిస్క్‌ చేసి నటించారని చెప్పారు. ఆమెను యాక్షన్‌ కథా చిత్రాల్లో దర్శకులు ఉపయోగించుకోవచ్చునని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు ఇంతకు ముందు మేల్‌ విలాసం అనే చిత్రాన్ని పూర్తిగా కోర్టు రూమ్‌లోనే చిత్రీకరించారని, అందులో నటుడు పార్తీపన్‌ నటించారని చెప్పారు. ఆ చిత్రం మాదిరిగానే ఈ చిత్రం చాలా వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ప్రేక్షకులు వైవిధ్యభరిత కథా చిత్రాలనే ఆదరిస్తున్నారని అన్నారు. సినిమా, ఓటీటీ,టీవీ, షార్ట్‌ , రీల్స్‌ అంటూ ఎందులో నటించాలన్న సందేహం కలుగుతోందన్నారు. తనకు సంబంధించినంత వరకూ ఏదైనా నటనేననీ, కాలానుగుణంగా మారాలని భావిస్తున్నానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement