క్రీడా ప్రాంగణంగా వేలచ్చేరి
సాక్షి, చైన్నె : రైల్వే స్టేషన్ల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న స్థలాలను ప్రజా ప్రయోజనాలకు వినియోగించేందుకు దక్షిణ రైల్వే సిద్ధమైంది. ఇందులో భాగంగా వేళచ్చేరి ఎంఆర్‌టీఎస్ రైల్వేస్టేషన్ ఆవరణను వివిధ క్రీడలకు మైదానంగా స్థలాన్ని మార్చేశారు. రైలు కోసం వేచి ఉండాల్సిన సమయంలో గానీ యండి, ఇంటికి వెళ్లే సమయంలో కాసేపు ఇక్కడ ఆడుకునేందుకు, వ్యాయామం చేయడానికి వీలుగా, పిల్లలు సైతం ఇక్కడ ఆడుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చైన్నె డివిజన్ పరిధిలో తొలిసారిగా ఖాళీగా ఉన్న రైల్వే స్థలాలను క్రీడల కోసం అభివృద్ధి చేయడం విశేషం. వేళచ్చేరి రైల్వేస్టేషన్ ఆవరణలో కొత్తగా నిర్మించిన క్రీడా కేంద్రాన్ని చైన్నె డివిజన్ అదనపు రైల్వే మేనేజర్ తేజ్‌ప్రతాప్‌సింగ్ ప్రారంభించారు. ఐదేళ్ల రాయితీ ఒప్పందం కింద ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఇక్కడ బాక్స్ క్రికెట్ పిచ్, పికిల్‌బాల్ కోర్టు, స్కేటింగ్ రింక్‌తో పాటు సిలంబం సాధన కోసం ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటు చేశారు. చైన్నె డివిజనల్ కమర్షియల్ విభాగం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం రైల్వే ప్రాంగణాలతో ప్రజల అనుబంధాన్ని మరింత బలపరచడమే కాకుండా, ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించనుంది. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ భరత్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.


