యువకుడిపై కత్తితో దాడి
తిరువళ్లూరు: ఇరువర్గాల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణలో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన క్రమంలో పోలీసుస్టేషన్‌లో సంతకం చేయడానికి వచ్చిన యువకుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా రామతండలం ప్రాంతానికి చెందిన సోదరులు అన్బరసన్(26), తెన్నరసు(24). గత డిసెంబర్ నెలలో అన్బరసన్‌కు బీమన్‌తోపు ప్రాంతానికి చెందిన అజిత్‌కుమార్ వర్గాల మధ్య గంజాయి విక్రయం వ్యవహరంపై ఘర్షణ జరిగింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్బరసును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దాదాపు నెల రోజులపాటు జైలులో గడిపిన అన్బరసు ఇటీవలే కండిషన్ బెయిల్‌పై విడుదలయ్యాడు. కండిషన్‌లో భాగంగా ప్రతి రోజూ అన్బరసు పుల్లరంబాక్కం పోలీసుస్టేషన్‌లో 17 రోజులపాటు సంతకం చేయాల్సి ఉంది. దీంతో అన్బరసు, అతడి సోదరుడు తెన్నరసు తదితర ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంలో రోజూ పోలీసుస్టేషన్‌కు వచ్చి సంతకం చేసి వెళ్లేవారు. యథావిధిగా సోదరులు సంతకం చేయడానికి ద్విచక్ర వాహనంలో పుల్లరంబాక్కం పోలీసుస్టేషన్‌కు బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లాక వీరిని కారులో వెంబడించిన అజిత్‌కుమార్‌తోపాటు మరో ఐదుగురు అన్బరసుపై విచక్షణరహితంగా దాడి చేశారు. తెన్నరసు వీరి దాడి నుంచి తప్పించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అన్బరసును అక్కడే వదిలిపెట్టి ప్రత్యర్దులు పరారైయ్యారు. అనంతరం తెన్నరసు తన బంధువులను సంఘటన స్థలానికి పిలిపించుకుని గాయపడ్డ అన్బరసును తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తరువాత మెరుగైన వైద్యం కోసం చైన్నెకు తరలించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.


