టీవీకే ఓ మహాశక్తి | - | Sakshi
Sakshi News home page

టీవీకే ఓ మహాశక్తి

Jan 26 2026 4:49 AM | Updated on Jan 26 2026 4:49 AM

టీవీక

టీవీకే ఓ మహాశక్తి

● భారీ సైన్యం మా పార్టీ సొంతం ● విజయ్‌ ధీమా ● ఎన్నికల గుర్తు విజిల్‌ కేడర్‌కు పరిచయం ● టీవీకేలోకి కూపాకృష్ణన్‌

సాక్షి, చైన్నె: టీవీకే ఓ మహాశక్తి అని.. దానికి సమరశంఖం పూరించే గొప్ప సైనికశక్తి ఉందని ఆ పార్టీ అధినేత విజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. మిత్రులు చేతులు కలిపినా, కలపకున్నా, ఒంటరిగానైనా ఎన్నికలను ఎదుర్కొని గెలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు మిలటరీ కంటే బలమైన సైన్యం తన వెన్నంటి ఉందని వ్యాఖ్యానించారు. గత నెల రోజులుగా టీవీకే అధ్యక్షుడు విజయ్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా కరూర్‌ కేసు సీబీఐ విచారణ నిమిత్తం ఢిల్లీ పర్యటనతో బిజీగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు విజయ్‌ ఆశించినట్టుగా ఎన్నికల చిహ్నం విజిల్‌ ఆ పార్టీ గుప్పెట్లోకి చేరింది. దీంతో నెల రోజుల తదుపరి కేడర్‌ ముందుకు విజయ్‌ వచ్చారు. ఆదివారం మహాబలిపురం వేదికగా ప్రైవేటు కన్వెన్షన్‌ సెంటర్‌లో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌, సమన్వయ కమిటీ కన్వీనర్‌ సెంగొట్టయ్యన్‌తో పాటూ నిర్మల్‌కుమార్‌, ఆదవ్‌ అర్జున, జేసిటీ ప్రభాకర్‌, నాంజిల్‌ సంపత్‌ వంటి ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా నాంజిల్‌ సంపత్‌ మాట్లాడుతూ, విజయ్‌ సీఎం కావడం తథ్యం అని, దీనిని ఎవ్వరూ ఆపలేరన్నారు. సెంగొట్టయన్‌ మాట్లాడుతూ, విజయ్‌ను ఏశక్తి నిలువరించే లేవు అని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేను గద్దె దించే శక్తి ఒక్క విజయ్‌కు మాత్రమే ఉందన్నారు. ఈ సమావేశంలో పార్టీ చిహ్నం విజిల్‌ను విజయ్‌ ఆవిష్కరించారు. తన బిగిల్‌ చిత్రంలోని కప్పు ముఖ్యం బిగిలే అన్న డైలాగుతో విజల్‌ మోతతో అధికారం చేజిక్కించుకుంద్దామన్న డైలాగులతో కేడర్‌ను విజయ్‌ ఆకర్షించే ప్రయత్నం చేశారు. గెలుపే లక్ష్యంగా శ్రమించే విధంగా అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అలాగే మాజీ సీఎం పన్నీరు సెల్వం మద్దతు నేత, అన్నాడీఎంకే మాజీ మంత్రి కూపా కృష్ణన్‌ విజయ్‌ సమక్షంలో టీవీకేలో ఈసందర్భంగా చేరారు.

తలొగ్గే ప్రసక్తే లేదు..

విజయ్‌ ఈ సమావేశంలో మాట్లాడుతూ, డీఎంకే, అన్నాడీఎంకేలను గురి పెట్టి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఒత్తిడినా... ఎవరి నుంచి ఒత్తిడి... తానేమీ బానిసను కాను.. ఏ ఒక్కరికి తలొగ్గే ప్రసక్తే లేదంటూ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని గురి పెట్టి వ్యాఖ్యల తూ టాలు పేల్చారు. విజయ్‌ అంత సామాన్యంగా ఎవరి ముందు తలొగ్గడని, ఇది వరకు రాష్ట్రాన్ని ఏలిన వాళ్లు బీజేపీకి బానిసగా మారి ఉన్నారని , వీరిని నమ్ముకుంటే ప్రయోజనం లేదన్నది ప్రజలు గ్రహించారని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే వాళ్లు వారిని తలదన్నే వారు అన్నది కూడా ప్రజలు గ్రహించారని, అందుకే టీవీకే కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలు విజయ్‌ను నమ్ముతున్నారని, మనల్ని నమ్మేవారికి నమ్మకంగా సేవ చేయడానికి సిద్ధం.. అని ప్రకటించారు. తాజాగా ఎన్నికలలో పొత్తు కసరత్తులు, చర్చలు, జోస్యాలు విస్తృతం అయ్యాయని వ్యాఖ్యానిస్తూ, 30 ఏళ్లుగా తనను అత్యున్నత స్థానంలో ఉంచిన రాష్ట్ర ప్రజలు, వారి ఇళ్లల్లో ఒ తమ్ముడిగా, అన్నగా, బిడ్డగా చూస్తున్నారని వివరించారు. నమ్ముకున్న వారి కోసం శ్రమించాలని, రాజకీయాలలోకి వచ్చినా, అధికారంలోకి వచ్చినా, అవినీతిని రూపు మాపడంలో ఈ విజయ్‌ రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. తానూ అవినీతికి పాల్పడను, అవినీతికి పాల్పడే వాళ్లను వదలి పెట్టను అని హెచ్చరించారు. సినిమాలలో వినేందుకు ఈ డైలాగులు బాగానే ఉంటాయని గుర్తు చేస్తూ, ఒకే రోజులో అన్నింటీనీ మార్చేయలేనని, దశల వారీ ప్రయత్నంతో అవినీతి నిర్మూలనలో విజయం వైపుగా అడుగులు వేస్తానన్నారు.

ఒంటరికై నా రెడీ

దుష్టశక్తి, అవినీతి శక్తికి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని, డీఎంకే, అన్నాడీఎంకేలు అధికారంలోకి రాకూడదన్న లక్ష్యంతోనే తాను మరింత ముందుకు వెళ్లనున్నట్టు వివరించారు. ఈ రెండు శక్తులను ఢీ కొట్టే దమ్ము , ధైర్యం తనకు ఉందన్నారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఒత్తిడి తెచ్చినా తగ్గబోనని, బానిసగా ఉండేందుకు తాను రాజకీయాలలోకి రాలేదన్నారు. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజలను రక్షించేందుకు దళపతిగా రాజకీయాలలో మరింతగా దూసుకెళ్లనున్నట్టు వివరించారు. ఇందుకు తన వెన్నంటి మహా మహిళా శక్తి, మహా కేడర్‌ సైన్యం ఉందని, అందరూ మనస్ఫూర్తిగా శ్రమిస్తే అధికారం తథ్యం అని వ్యాఖ్యాలు చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు బూత్‌ కమిటీలు దొంగ ఓట్లు వేయించే గుడారం అని, అయితే, టీవీకేకు బూత్‌ కమిటీలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సైన్యం అని వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఇంటా విజయ్‌ ఉన్నాడని, ఆ ఇళ్లల్లో మనకంటూ ఉన్న ఒక్కో ఓటు కూడా చేజారకుండా బూత్‌ కమిటీలు శ్రమించాలని పిలుపు నిచ్చారు. పార్టీకి కేడర్‌ పునాది అని, అందరూ స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు. ఎన్నిలకు మూడు నెలలు కూడా సమయం లేదని, తాను సూచించే అభ్యర్థికి మద్దతుగా కేడర్‌ పనిచేయాలని, గెలిపించాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా రాణి వేలునాచ్చియార్‌ వీరోచితాన్ని గుర్తు చేస్తూ, తనతో కలిసి పనిచేయడానికి మిత్రులు వచ్చినా, రాకున్నా, ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీ అని ప్రకటించారు. నాడు వేలునాచ్చియార్‌కు అండగా చిన్న మరుదు, పెద్ద మరుదు, సయ్యద్‌ ఉండే వారని, ఇప్పుడు తన సైన్యంలో ఉండే వాళ్లందరూ ఈ ముగ్గురే అని వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి శక్తులు వచ్చినా సరే వారిని ఎన్నికల యుద్ధంలో ఢీ కొట్టేందుకు తన వెన్నంటి మిలటరీ కన్నా బలమైన సైనిక శక్తి ఉందని ధీమా వ్యక్తం చేశారు. విజయ్‌ సైన్యం గురించి రాజకీయ విశ్లేషకులకే అంతు చిక్కడం లేదని, అవినీతి, దుష్ట శక్తులను తరిమి కొట్టేందుక ప్రజా శక్తితో కలిసి ఎన్నికల కదన రంగంలోకి దిగుతున్నానని, గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.

టీవీకే ఓ మహాశక్తి1
1/1

టీవీకే ఓ మహాశక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement