గణతంత్ర ముస్తాబు!
నిఘా వలయంలో రాష్ట్రం విమానాశ్రయాల్లో భద్రత పెంపు తుపాకీ నీడలో ‘మెరీనా’ తీరం పలువురికి రాష్ట్రపతి పతకాలు 21 మందికి సర్వీస్ మెడల్స్ 44 మందికి పోలీసు అధికారులకు రాష్ట్ర పతకాలు గవర్నర్ విందుకు దూరంగా పార్టీలు
గణతంత్ర వేడుకలకు రాష్ట్రం ముస్తాబయ్యింది. కేంద్ర ప్రభుత్వ వర్గాల హెచ్చరికతో రాష్ట్రాన్ని అధికారులు నిఘానీడలోకి తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. చైన్నెలో వేడుకలు జరిగే మెరీనా తీరాన్ని డేగకళ్లతో కాపుకాస్తున్నారు. ఈ పరిసరాలను రెడ్‌జోన్‌గా ప్రకటించి 7 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.
సాక్షి, చైన్నె: దేశవ్యాప్తంగా సోమవారం జరగనున్న 77వ రిపబ్లిక్ డే వేడుకలకు తమిళనాడుతో పాటూ పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముస్తాబైంది. ఈమేరకు ఉదయాన్నే వాడ వాడల్లో మువ్వన్నెల జెండా రాష్ట్ర వ్యాప్తంగా రెప రెపలాడించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ప్రభుత్వ, ప్రైవేటు, కార్యాలయాలు, విద్యా సంస్థల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. శనివారం రాత్రి నుంచి వాహన తనిఖీలు అన్ని జిల్లాల్లో విస్తృతంగా చేపట్టారు. జన సంచారం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో భద్రతను పెంచారు. చైన్నె ఎంజీఆర్ సెంట్రల్, ఎగ్మూర్, తాంబరం, తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు, సేలం, ఈరోడ్, విల్లుపురం, తిరునల్వేలి తదితర ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, ప్రముఖ ఆలయాలు, ప్రార్థనా మందిరాలను నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. చైన్నెతో పాటూ మదురై, తిరుచ్చి, తూత్తుకుడి, సేలం విమానాశ్రయాల్లో భద్రతను మరింతగా పెంచారు. వేడుకలు జరిగే ప్రధాన నగరాలలో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. జెండా ఆవిష్కరణ, వేడుకల అనంతరం గ్రామ పంచాయతీలలో గ్రామసభల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఇక, అన్ని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ భవనాలన్నీ విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. పుదుచ్చేరిలో అయితే పండుగ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా మిరుమిట్లు గొల్పే దీప కాంతాలతో కార్యాలయాలు అలరారుతున్నాయి. ఇక్కడ ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నరన్ కై లాస్ నాథన్ జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నారు.
చైన్నె మెరీనా తీరంలో..
చైన్నెలో వేడుకలు జరిగే మెరీనా తీరం పరిసరాల్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మెట్రో పనుల దృష్ట్యా గాంధీ విగ్రహం వద్ద కాకుండా ఈసారి కూడా వేడుకలను శ్రామిక విగ్రహం వద్దే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వేడుకలను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం మెరీనా తీరం వైపుగా తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందుగా ఈ వేడుకల నిమిత్తం సీఎం స్టాలిన్ శ్రామిక విగ్రహం వద్దకు ఉదయం రానున్నారు. దారి పొడవున ఉండే ప్రజలకు అభివాదం తెలుపుతూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తారు. అనంతరం గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఇక్కడికి వస్తారు. ఆయన జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు. ఆ తదుపరి పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన జరగనున్నాయి. ఈసారి వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు చాటే ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. వేడుకలు జరిగే ప్రాంతాన్ని పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. కాగా గత కొంతకాలంగా లోక్ భవన్‌తో సాగుతున్న సమరం నేపథ్యంలో గణతంత్ర వేడుకల సందర్భంగా గవర్నర్ ఇచ్చే విందుకు ఈసారి కూడా డీఎంకే కూటమి పార్టీలు దూరంగా ఉండేందుకు నిర్ణయించాయి.
సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో విద్యుత్ కాంతులు
రాష్ట్రపతి పతకాలు
గణతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్రపతి పతకాలకు రాష్ట్రం నుంచి పలువురు పోలీసు అధికారులు ఎంపికయ్యారు. పోలీసు శాఖలో ఉత్తమ సేవలను అందించిన చైన్నె ఐజీ మహేశ్వరి, ఎస్పీ అన్వర్‌బాషా, డీఎస్పీ కుమర వేల్‌లకు రాష్ట్రపతి పతకాలను ప్రకటించారు. మరో 21 మందికి కేంద్ర హోంశాఖ నేతృత్వంలో పోలీసు సర్వీస్ మెడల్స్ అందజేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో పోలీసు మెడల్స్‌ను 44 మందికి సీఎం స్టాలిన్ ప్రకటించారు. వీరికి పది గ్రాముల బంగారు పతకంతో పాటూ తలా రూ. 25 వేలు నగదు అందజేయనున్నారు.
గణతంత్ర ముస్తాబు!


