స్టాలిన్‌కుమళ్లీ అధికారం కల్లే!
సాక్షి,చైన్నె : స్టాలిన్‌కు మళ్లీ అధికారం అన్నది కల్లే అని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యాఖ్యానించారు. డీఎంకేకు పతనం మొదలైందన్నారు. చూలైలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పళణిస్వామి మాట్లాడుతూ, 2021 ఎన్నికలలో మ్యానిఫెస్టోతో ప్రజల్ని ఆకర్షించిన స్టాలిన్ పాచికలు ఈ సారి పారబోవన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగ, కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందన్నారు. ప్రజలు సైతం ఈ పాలకుల తీరుపై గుర్రుగా ఉన్నారని, ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. 2026లో అన్నాడీఎంకే అధికారంలోకి రావడం తథ్యమన్నారు. స్టాలిన్ పేర్కొంటున్నట్టుగా ద్రావిడ మోడల్ 2.ఓ, మళ్లీ అధికారం అన్న మాటలన్నీ ఆయనకు కలగానే మిగలబోతున్నాయని ఎద్దేవా చేశారు.
మళ్లీ అమిత్ షా పర్యటన
సాక్షి, చైన్నె: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ రెండు రోజుల పర్యటనకు సన్నద్దమవుతున్నారు. ఇందులో భాగంగా బహిరంగ సభ కసరత్తులలో బీజేపీ వర్గాలు నిమగ్నమయ్యాయి. డీఎంకే గద్దె దించి తీరుతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శపథం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యూహాలకు పదును పెడుతున్నారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిన అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ను మళ్లీ కూటమిలోకి తీసుకు రావడంలో సఫలీకృతులయ్యారు. తాజాగా తమ కూటమిలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, టీటీవీ దినకరన్‌లు సమష్టిగా పనిచేసే దిశగా ఉరకలు తీస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో విస్తృత పర్యటనల దిశగా కేంద్ర మంత్రులను ఒకరి తర్వాత మరొకర్ని రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితులలో ఈనెల మొదటి వారంలో రెండు రోజుల పాటుగా పుదుకోట్టై, తిరుచ్చిలో అమిత్ షా పర్యటన జరిగింది. తాజాగా మళ్లీ ఆయన పర్యటనకు సన్నద్ధం అవుతున్నారు. శుక్రవారం ఉత్తర తమిళనాడులో బలాన్ని చాటే విధంగా చైన్నె శివారులోని మదురాంతకంలో ప్రధాని నరేంద్ర మోదీ సభసూపర్ సక్సెస్‌కావడంతో బీజేపీ వర్గాలు మంచి జోష్ మీదున్నాయి. అదేఊపుతో ఈ నెల 28, 29 లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అమిత్ షా పర్యటనకు సంబందించిన కసరత్తు మొదలెట్టారు. ఈసారి కొంగు మండలంలోని ధర్మపురి, సేలం ,నామక్కల్ పరిసరాలను గురి పెట్టి అమిత్ షా పర్యటనకు అవసరమైన ఏర్పాట్లకు కమలం నేతలు సిద్ధమయ్యారు.
ఓమ్ని బస్సు ఢీకొని
ముగ్గురు మృతి
– 20 మందికి గాయాలు
తిరువొత్తియూరు: మేలూరు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఓమ్ని బస్సును మరో బస్సుఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు..చైన్నె నుంచి నాగర్‌కోయిల్‌కు ఓ ప్రైవేట్ ఓమ్ని బస్సు శనివారం రాత్రి చైన్నె నుంచి బయలుదేరింది. బస్సులో 40 మందికి పైగా ప్రయోణికులు ఉన్నారు. మధురై జిల్లా మేలూరు దగ్గర కొట్టాంపట్టికి ఆనుకుని ఉన్న పళ్ళపట్టి ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు కాలకృత్యాల కోసం బస్సును రోడ్డు పక్కన నిలిపారు. ఆ సమయంలో చైన్నె నుంచి నాగర్‌కోయిల్‌కు వెళ్తున్నా మరో ప్రైవేట్ ఓమ్ని బస్సు, రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఓమ్ని బస్సు వెనుక భాగాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ క్రమంలో తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టికి చెందిన రంజితం(65), చెంగల్పట్టు జిల్లాకు చెందిన సుదర్శన్ (23) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. బస్సు డ్రైవర్ చైన్నెకి చెందిన గురుమూర్తి (28)తో పాటు రెండు బస్సుల్లో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈక్రమంలో కన్యాకుమారి జిల్లా మార్తాండంకు చెందిన మేరీ సుధ (45) ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో మరణించారు. ఈ ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం మధురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో వాహన రాకపపోకలకు అంతరాయం ఏర్పడింది.
స్టాలిన్‌కుమళ్లీ అధికారం కల్లే!


