కనిమొళి నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ
– ఇక రాష్ట్రవ్యాప్తంగా పర్యటన
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నిలకు మేనిఫెస్టో రూపకల్పనపై డీఎంకే దృష్టి పెట్టింది. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపి కనిమొళి కరుణానిధి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి ఎన్నికలలోనూ ఓటర్లను ఆకర్షించే విధంగా డీఎంకే మేనిఫెస్టోను ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందుగా ఓ కమిటీని ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల అభిప్రాయాలతో ఈ మేనిఫెస్టో రూపకల్పన జరుగుతోంది. తాజాగా 2026 అసెంబ్లీ ఎన్నికల ద్వారా మళ్లీ అధికారం దిశగా వ్యూహరచనలో ఉన్న డీఎంకే తాజాగా మేనిఫెస్టో రూపకల్పనకు సన్నద్ధమైంది. మరింత ప్రజాకర్షణ దిశగా ఈ సారి మేనిఫెస్టో రూపకల్పనకు విస్తృతంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ బుధవారం కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో మంత్రులు కోవి చెలియన్, పీటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్, టీఆర్‌బీ రాజ, అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్, మైనారిటీ నేత ఎంఎం అబ్దుల్లా, అనుబంధ విభాగాలకు చెందిన నేతలు రవీంద్రన్, ఎలిళన్ నాగనాథన్, కార్తికేయ శివ సేనాధిపతి, తమిళరసి రవికుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంతానం, వ్యాపార రంగానికి చెందిన దురై సంబంధం వంటి వారిని ఈ కమిటీలో నియమించారు. ఈ కమిటీ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌తో తొలుత సమావేశం అవుతుంది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించునుంది. వివిధ సామాజిక వర్గాల ప్రజలు, వర్తకులు, చేనేత కార్మికులు అంటూ వివిధ రంగాలలోని వారిని, విద్యా వేత్తలు, నిపుణులు తదితరులతో రాష్ట్రవ్యాప్తంగా సమావేశం కానుంది. అభిప్రాయాలను సేకరించి బృహత్తర పథకాల మేనిఫెస్టోను రూపొందించి స్టాలిన్‌కు అందజేయనుంది.


