కన్యాకుమారి తీరంలో అల్పపీడనానికి అవకాశం
– దక్షిణాదిలో విస్తారంగా వానలు
సాక్షి,చైన్నె: దక్షిణ తమిళనాడు, పశ్చిమ కనుమలలోని జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కన్యాకుమారి తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలతో మరో మూడురోజులు వర్షాలు కొనసాగనున్నాయి. వివరాలు.. దిత్వా తదుపరి వర్షాలకు రాష్ట్రంలో బ్రేక్‌పడ్డ విషయం తెలిసిందే. మళ్లీ మంగళవారం నుంచి వర్షాలు మొదలయ్యాయి. ఓ వైపు చలి పులి మరోవైపు మంచు దుప్పటి నేపథ్యంలో తాజాగా వర్షాలు విస్తరిస్తున్నాయి. పశ్చిమకనుమల వెంబడి ఉన్నకన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశి,తేని , తిరుప్పూర్ జిల్లాల పరిధిలోని అటవీ గ్రామాలలో బుధవారం ఉదయం నుంచి వర్షాలు పడుతుండడంతో అక్కడి నుంచి వాగులు, జలపాతాలలోకిబుధవారం నీటి రాక పెరిగింది. తిరుప్పూర్‌లోని పంచ లింగ కోనలో నీటి ఉధృతి పెరగడంతో భక్తులకు అనుమతి ఇవ్వలేదు. అమర లింగేశ్వర ఆలయాన్ని తాకుతూ నీరు ప్రవహిస్తోంది. పొల్లాచ్చిలోని ఆలియారు లోనీటి ఉధృతి పెరిగింది. తెన్‌కాశిలోని కుట్రాలంలో నీటి ఉధృతి అమాంతంగా పెరగడంతో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. దీంతో స్నానం చేయడానికి వచ్చిన అయ్యప్ప భక్తులకు నిరాశ తప్పలేదు. దిండుగల్, విరుదునగర్, రామనాథపురంలోనూ వర్షాలు పడుతున్నాయి.దక్షిణ తమిళనాడు, ఇక్కడి వాగులు వంకలు ఇప్పటికే పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లు అన్ని నిండుకుండలుగా ఉన్నాయి. ఇక్కడ నైరుతీ, ఈశాన్య రుతు పవనాలతో సంవృద్ధిగా వర్షాలు పడి ఉన్నాయి. మళ్లీ వర్షాలతో ఇక్కడి ప్రజలు,రైతుల కలవరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులలో కన్యాకుమారి తీరంలో అల్పపీడనంకు అవకాశం ఉందని వాతావరణ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ దృష్ట్యా, మరోమూడు రోజులు వర్షాలు ఇక్కడ కొనసాగనున్నాయి. ఈ అల్పపీడనం ప్రభావం మేరకు ఆ తదుపరి వర్షాల తీవ్రత గురించి ఓ ప్రకటన విడుదల చేస్తామని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


