కమల వ్యూహం.. రంగంలోకి త్రిమూర్తులు
బీజేపీలో నూతనంగా ముగ్గురు ఇన్‌చార్జ్‌ల నియామకం
పియూష్ గోయల్ నేతృత్వం ఎన్నికల పనులు
కో– ఇన్‌చార్జ్‌లుగా మరో ఇద్దరుకేంద్రమంత్రులు
ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టిన కాషాయపార్టీ
సాక్షి, చైన్నె: డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ పాలకులు వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడులో అన్నాడీఎంకే నేతృత్వంలో కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ, ఈ రెండు పార్టీల మధ్య సమన్వయ లోపం అన్నది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో తమకు పట్టున్న నియోజకవర్గాలను బీజేపీ గుర్తించింది. రాష్ట్రంలో 65 నియోజకవర్గాలలో తమకు బలం ఉందని అంచనావేశారు. ఈ బలానికి కూటమి మద్దతు తోడైన పక్షంలో అభ్యర్థుల గెలుపు సునాయాసంగా బీజేపీ అధినేతలు భావిస్తున్నారు. ఈ 65లో కనీసం 50 నుంచి 54 స్థానాలను అన్నాడీఎంకే నుంచి రాబట్టుకునే దిశగా కసరత్తు వేగవంతం చేశారు. అయితే తమకు పట్టుకొమ్మగా ఉన్న స్థానాలపై బీజేపీ కన్నెయడాన్ని ఆయా నియోజకవర్గాలలోని అన్నాడీఎంకే వర్గాలు గుర్రు మంటున్నాయి. ఎన్నికల సమయానికి ఈ వ్యవహారం ఎలాంటి వివాదాలకు దారి తీస్తుందో అన్న చర్చ ఊపందుకుంది. ఈ పరిస్థితులలో తమిళనాడులో బిహార్ తరహా ఎన్నికల ఫార్ములా వ్యూహాన్ని అమలు చేయడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సిద్ధమైనట్టు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ఇక, పది రోజులకు ఓ మారు తమిళనాడులో పర్యటించేందుక ఆయన కార్యాచరణలో ఉన్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మంద్ర ప్రదాన్, అశ్విని వైష్ణవ్, ఎల్. మురుగన్ తదితరులను తమిళనాడులో విస్తృతంగా పర్యటించే దిశగా ఆదేశాలు వెళ్లి ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా వారి పర్యటనల రూట్‌మ్యాప్ కసరత్తులలో రాష్ట్ర బీజేపీ వర్గాలు ఉన్నాయి. శని, ఆదివారాలలో ఢిల్లీలో కేంద్ర పెద్దలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సమావేశాన్ని ముగించి వచ్చారు. ఈ పరిస్థితులలో రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లను అధిష్టానం రంగంలోకి దించడం గమనార్హం.
ఇన్‌చార్జ్‌గా పీయూష్ గోయల్
తమిళనాడు బీజేపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా అరవింద్‌మీనన్, కో– ఇన్‌చార్జ్‌గా పొంగులేటిసుధాకర్‌రెడ్డి ఉన్నారు. వీరికి సైతం మార్గదర్శకం చేసే దిశగా బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లు రంగంలోకి దిగనున్నారు. ఇందులో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇన్‌చార్జ్‌గా ఉంటారు. న్యాయ శాఖ కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రాంమెహ్వాల్, కేంద్ర విమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మోహుల్ కో– ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పీయూస్ గోయల్ సన్నిహితులు. ఆయన ఇది వరకు అనేక రాష్ట్రాలలో ఎన్నికల వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించారు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలలో కూటమి సంబంధిత అంశాలలో నెలకొన్న చిక్కు ముడులను తొలగించి బీజేపీకి బలాన్ని చేకూర్చి ఉన్నారు. తాజాగా ఆయన్ని తమిళనాడు ఇన్‌చార్జ్‌గా నియమించడంతో అన్నాడీఎంకే కూటమిలోని సమస్యలు, వివాదాలన్నీ తొలగే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
కమల వ్యూహం.. రంగంలోకి త్రిమూర్తులు
కమల వ్యూహం.. రంగంలోకి త్రిమూర్తులు
కమల వ్యూహం.. రంగంలోకి త్రిమూర్తులు


