పార్టీ నుంచి వైదొలగేందుకు సిద్ధం
సాక్షి, చైన్నె: రాందాసు, అన్బుమణి ఏకం అవుతారంటే పార్టీ నుంచి వైదొలగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పీఎంకే గౌరవ అధ్యక్షుడు జికేమణి ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. తానే కాదు, ఎవ్వరెవ్వరు ద్రోహులు అని అన్బుమణి భావిస్తున్నారో, వారంతా బయటకు వెళ్లడానికి సన్నద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పీఎంకేలో రాందాసు, అన్బుమణి రాందాసు మధ్య సమరం తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అదే సమయంలో తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య వివాదాలకు గౌరవ అధ్యక్షుడు జీకే మణి కారణంగా పేర్కొంటూ ఆరోపణలు బయలుదేరాయి. అన్బుమణి మద్దతు దారులే ఈ ఆరోపణలను ప్రత్యక్షంగానే చేస్తూ వచ్చారు. తాజాగా అన్బుమణి సైతం ఇదే వ్యాఖ్యలు చేయడంతో జీకే మణి తీవ్రమనస్తాపంతో చైన్నె ప్రెస్ క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజీనామా చేసి తప్పుకుంటా..
జీకే మణి మాట్లాడుతూ, పీఎంకే ఆవిర్భావ కాలం నుంచి పార్టీ జెండాను మోసిన వ్యక్తిని తాను అని, పెద్దాయన రాందాసు ఆదేశాలకు అనుగుణంగానే 3 దశాబ్దాలకు పైగా రాజకీయాలలో అడుగులు వేస్తూ వచ్చానని వివరించారు. తండ్రి, తనయుడి మధ్య గొడవలకు తాను కారణం అని పేర్కొనడం విచారకరం అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అన్బుమణిని రాజకీయాల్లోకి తీసుకు రావాలని రాందాసుకు సూచించింది తానేనని అన్నారు. మనఃసాక్షి లేకుండా అన్బుమణి మాట్లాడటం వేదనగా ఉందని, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్న ఉద్దేశంతో తానే కాదు, తన లాంటి వారందరూ బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాందాసు, అన్బుమణి ఒక్కటి కావాలని, ఇద్దరు ఒకే వేదికపైకి వస్తే, అన్బుమణి ఎవ్వరెవ్వర్ని ద్రోహిగా భావిస్తున్నారో, వారంతా రాందాసుకు దూరంగా పీఎంకే నుంచి రాజీనామా చేసి వైదొలగేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. కలలో కూడా ఎవ్వరి తాను ద్రోహం చేయలేదని స్పష్టం చేశారు.


