క్రీడాకారులకు సీఎం ప్రోత్సాహం
సాక్షి, చైన్నె: మాల్దీవులలో జరిగిన 7వ క్యారమ్ ప్రపంచ కప్ పోటీలలో పతకాలతో తిరిగి వచ్చిన తమిళనాడు క్రీడాకారిణీలను ప్రోత్సహిస్తూ సీఎం స్టాలిన్ నగదు బహుమతి ప్రకటించారు. వివరాలు.. మాల్దీవులలో ఈనెల 2వ తేదీ నుంచి 6 వతేదీ వరకు ప్రపంచ కప్ క్యారమ్ పోటీలు జరిగాయి. ఇందులో తమిళనాడు నుంచి కీర్తన, కాశిమా, మిత్రాలు పాల్గొని పతకాలతో తిరిగి వచ్చారు. ఇందులో కీర్తనకు రూ. కోటి, కాశిమాకు రూ. 50 లక్షలు, మిత్రకు రూ. 40 లక్షలు ప్రోత్సాహక నగదును సచివాలయంలో స్టాలిన్ అందజేశారు. వారిని అభినందించారు. అలాగే చైన్నెలో ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఇండియన్ స్క్వాష్ అకాడమీ నేతృత్వంలో జరిగిన ఎస్‌డీఏటీ స్క్వాష్ పోటీలలో విజేతలను పిలిపించి అభినందించారు. స్క్వాష్ ప్రపంచ కప్ 2025 విజేతగా నిలిచిన భారత జట్టు ఆటగాళ్లు జోష్నా చిన్నప్ప, అబే సింగ్, అనాహత్ సింగ్, వెలవన్ సెంథిల్ కుమార్, స్క్వాష్ ఛాంపియన్‌షిప్ డైరెక్టర్ శ్రీ సైరస్ బోన్సా, కోచ్‌లు హరీందర్ పాల్ సింగ్ , అలాన్ జోయ్సాలు సీఎం స్టాలిన్ ప్రశంసించారు. క్రీడలను ప్రోత్సహించే ఉత్తమ రాష్ట్రంగా తమిళనాడు అవతరించిందని వ్యాఖ్యలు చేశారు.
సీఎంకు అందజేత..
ఇక, ఢిల్లీలో ఈనెల 9వ తేదీ జరిగిన 3వ సీఐఐ స్పోర్ట్స్ బిజినెస్ మీట్‌లో తమిళనాడు క్రీడాభివృద్ధి అథారిటీకి ఉత్తమ అవార్డు దక్కింది. ఈ అవార్డును సీఎం స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్ అథారిటీ సభ్య కార్యదర్శి జె. మేఘనాథరెడ్డి ఈసందర్భంగా అందజేశారు. అనంతరం సీఎం స్టాలిన్ పేర్కొంటూ, భారతదేశంలో క్రీడా రంగంలో అత్యుత్తమ రాష్ట్రం తమిళనాడు అవతరించి ఉందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వివిధ పోటీలకు వేదికగా నిలుస్తూ వస్తోందని వివరించారు. ప్రభుత్వ ప్రోత్సహంతో వివిధ స్థాయిలలో జరిగిన వివిధ క్రీడా పోటీలలో తమిళనాడు నుంచి క్రీడాకారులు పాల్గొని పతకాలతో తిరిగి వస్తుండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్రీడాకారులకు అంర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ అందించడం, క్రీడలకు అధిక ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలు కల్పించడం, సౌకర్యాలను సృష్టించడం వంటి పనులలో తమ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని ప్రకటించారు.


