హజ్‌హౌస్ నిర్మాణానికి సన్నద్ధం
● విమానాశ్రయం సమీపంలో పనులు
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజధాని నగరం చైన్నెలో హజ్ హౌజ్ నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. విమానాశ్రయానికి సమీపంలో బ్రహ్మాండ భవనంగా హజ్ హౌస్‌ను నిర్మించనున్నారు. ప్రతి ఏటా బక్రీదు పండుగకు ముందుగా ముస్లింలు హజ్ యాత్ర నిమిత్తం మక్కా, మదీనాకు వెళ్లడం జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రం నలుమూలల నుంచి హజ్ కమిటీ ద్వారా సుమారు మూడు వేల మందికి పైగా ఎంపిక చేసి ప్రభుత్వం ఈ యాత్రకు ముస్లింలను పంపిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హజ్‌యాత్ర కోసం ఒక రోజు లేదా, రెండు రోజులకు ముందుగానే ముస్లింలు చైన్నెకు చేరుకుంటారు. వీరంతా ప్రైవేటు హోటళ్లు, లాడ్జీలలో బస చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితులలో మైనారిటీ ప్రజలకు అండగా, వారి హక్కుల పరిరక్షణలో ముందడుగు వేస్తున్న ద్రవిడ మోడల్ ప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా హజ్ హౌస్ భవనం నిర్మాణానికి సిద్ధమైంది. ప్రతి సంవత్సరం చైన్నెకి హజ్ యాత్ర చేయడానికి వచ్చే ముస్లింలు విమానాశ్రయం సమీపంలో బస చేయడానికి వీలుగా హజ్ హౌస్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. రూ.39.20 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. రోజుకు ఇక్కడ 400 మంది బస చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. ఇది తమిళాడు హజ్ హౌస్‌గా హజ్ యాత్రికుల కోసం నిర్మించనున్నారు. ఈ పనులకు మంగళవారం సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేయనున్నారు.
విజయ్ ప్రచారానికి షరతులు
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఈరోడ్ ప్రచారానికి అనేక షరతులను విధించారు. 25 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చే విధంగా 5 షరతులను పోలీసులు విధించి, వాటిని అనుసరించే విధంగా హకుం జారీ చేశారు. కరూర్‌లో జరిగిన విషాద ఘటన తదుపరి ప్రపథమంగా రాష్ట్రంలో ఈరోడ్ వేదికగా మీట్ దిపీపుల్ ప్రచార కార్యక్రమానికి విజయ్ సన్నద్దమయ్యారు. అయితే, అనుమతి , ఆంక్షల కొరడా వెరసి రెండు సార్లు తేదీ మార్చుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు 18వ తేదీ సభ నిర్వహనకు ఏర్పాట్లు మొదలెట్టారు. ఈ కార్యక్రమం బల నిరూపణకు వేదికగా మారి ఉంది. కొంగు మండలానికి చెందిన సెంగొట్టయ్యన్ అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి తనతో చేతులు కలిపిన అనంతరం జరుగుతున్న ప్రచారం కావడంతో ప్రతిష్టాత్మకంగా ఈ సభను విజయ్ పరిగణించి ఉన్నారు. ఈరోడ్‌లోని విజయ మంగళం ఆలయ సమీపంలోని స్థలాన్ని బహిరంగ సభకు వేదికగా ఎంపిక చేశారు. ఈ స్థలం ఆలయానికి చెందినందంటూ వివాదం రేగడంతో చివరకు ఆ స్థలానికి అద్దెకుతీసుకున్నారు. భద్రతా పరమైన ఏర్పాట్లు, వచ్చే కార్యకర్తలకు ఆహారం, నీళ్లు తదితర సౌకర్యాల కల్పనతోపాటూ నిర్ణీత సమయానికి రావాలని, కార్యక్రమాన్ని ముగించాలంటూ మొత్తంగా సభకు 2గంటల సమయం కేటాయించి ఉన్నారు. కేవలం 25 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చే విధంగా మరెన్నో షరతులను విధించారు. సొంత ఖర్చుతో మళ్లీ ఆ స్థలాన్ని చదును చేయించడం, ఇతర శుభ్రతా పనులు చేపట్టడం వంటి బాధ్యతలన్నీ టీవీకే వర్గాలకే అప్పగించారు.
మినీ స్టేడియానికి భూమిపూజ
తిరువళ్లూరు: కాకలూరులో సుమారు మూడు కోట్లు రూపాయల వ్యయంతో నిర్మించనున్న మినీ స్టేడియానికి నిర్మాణానికి మంత్రినాజర్ సోమవారం భూమిపూజ చేశారు. తిరువళ్లూరు, గుమ్మిడిపూండి, పూందమల్లి తదితర మూడు నియోజకవర్గాల్లోని ఒక్కో ప్రాంతంలో మూడు కోట్లు వ్యయంతో మినీ స్టేడియం నిర్మాణం చేస్తామని, తద్వారా క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తామని అప్పట్లో క్రీడాశాఖ మంత్రి ఉధయనిధి స్టాలిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పూందమల్లి నియోజకవర్గం కాకలూరులో ఆరు ఎకరాల విస్తీర్ణంలో మినీస్టేడియం నిర్మాణానికి భూమిపూజను మంత్రినాజర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యే కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 19 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 81,345 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,150 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది.


