అన్నాడీఎంకేలో దరఖాస్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకేలో దరఖాస్తుల సందడి

Dec 16 2025 4:49 AM | Updated on Dec 16 2025 4:49 AM

అన్నాడీఎంకేలో దరఖాస్తుల సందడి

అన్నాడీఎంకేలో దరఖాస్తుల సందడి

● భారీగా తరలి వచ్చిన ఆశావహులు

సాక్షి,చైన్నె : అన్నాడీఎంకేలో దరఖాస్తుల సందడి మొదలైంది. శాసన సభలో అడుగు పెట్టాలన్న ఆశతో ఆశావహులు పెద్దఎత్తున తరలి వచ్చి దరఖాస్తులను కొనుగోలు చేయడమే కాకుండా అక్కడికక్కడే పూర్తిచేసి సమర్పించారు. దీంతో రాయపేటలోని ఎంజీఆర్‌ మాళిగై పరిసరాలలో పండుగ వాతావరణం నెలకొంది. వివరాలు.. 2026లో అధికారమే లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఉరకలు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా ఎన్నికల నగారా మోగేందుకు కొద్ది రోజులకు ముందుగా ఆశావహుల నుంచి అన్నాడీఎంకేలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. అయితే ఈసారి ముందుగానే ఈ ప్రక్రియపై దృష్టి పెట్టారు. అన్నాడీఎంకే కార్యకర్తల పార్టీ అని, సాధారణ కార్యకర్త కూడా సీఎం కావచ్చు, పార్టీ అధినేత కావచ్చు అని పలు సందర్భాలలో పళణిస్వామి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దీంతో ఈసారి ముఖ్య నేతలే కాదు, ద్వితీయ శ్రేణి నేతలు సైతం తమకు అవకాశం వస్తుందన్న ఆశతో దరఖాస్తులపై దృష్టి పెట్టారు. ఉదయాన్నే రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఎంజీఆర్‌ మాళిగైలో దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. జనరల్‌, రిజర్వుడ్‌ స్థానాలకు రూ. 15 వేలు చెల్లించి ఆశావహులు దరఖాస్తులు స్వీకరించేపనిలో పడ్డారు. దరఖాస్తుల కోసం ఉదయాన్నే వందలాది మంది బారులుదీరారు. కొందరు అయితే, దివంగత నేతలు ఎంజీఆర్‌, జయలలిత వేషాధారణలలో ప్రత్యేక ఆకర్షణగా వచ్చి దరఖాస్తులను కొనుగోలుచేశారు.

ఎంజీఆర్‌ మాళిగైలో పండుగ వాతావరణం

ఎంజీఆర్‌ మాళిగై పరిసరాలలో ఏదో పండుగ వాతావరణం నెలకొన్నట్టుగా పరిస్థితి మారింది. కొందరు అయితే, తమ కోసం, మరి కొందరు అయితే, పళని స్వామి తమ నియోజకవర్గంలో అంటే తమ నియోజకవర్గంలో పోటీ చేయాలని కోరుతూ దరఖాస్తులు స్వీకరించారు. అక్కడికక్కడే వాటిని పూర్తి చేసి సమర్పించారు. పార్టీ ముఖ్య నేతలు ఎస్పీ వేలుమణి, తంగమణి తదితరులు సైతం తమ నియోజకవర్గాలలో మళ్లీ పోటీకి అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తులను కొనుగోలు చేసి తక్షణం పూర్తి చేసి సమర్పించడం గమనార్హం.ఈ దరఖాస్తుల ప్రక్రియ అన్నాడీఎంకేలో ఈనెల 23వ తేదీ వరకు జరుగుతుంది. దరఖాస్తులను పరిశీలించి జాబితాను సిద్ధం చేస్తారు. ఆశావహులను పళణి స్వామి నేతృత్వంలోని కమిటీ ఇంటర్వ్యూలు చేసి, ఆ తదుపరి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement