పుదుచ్చేరిలో ‘ఎల్‌జేకే’ ఆవిర్భావం
సాక్షి, చైన్నె : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కొత్త పార్టీ ఏర్పాటైంది. లాటరీ అధిపతి లాటరీ మార్టిన్ తనయుడు జోష్ చార్లెస్ ఈ రాజకీయ పార్టీని ప్రకటించారు. దీనికి ఎల్‌జేకే అని నామకరణం చేశారు. కేరళతో పాటుగా పలు రాష్ట్రాలలో లాటరీల విక్రయాలలో బడా పారిశ్రామిక వేత్తగా మార్టిన్ ఎదిన విషయం తెలిసిందే. లాటరీ మార్టిన్‌గా పేరుగడించిన ఆయనకు కోయంబత్తూరు కేంద్రంలో పలు నగరాలలో అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఆయన వారసుడు జోష్ చార్లెస్ గత కొంత కాలంగా తన దృష్టిని పుదుచ్చేరిపై కేంద్రీకరించారు. ఇక్కడ ప్రజలకు దగ్గరయ్యే విధంగా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ వచ్చారు.ఈ పరిస్థితులలో తాజాగా ఆయన లక్ష్య జననాయగ కట్చి(ఎల్‌జేకే)ను ప్రకటించారు. ఈ పార్టీ ఆవిర్భావ వేడుకకు ముందుగా సర్వమత ప్రార్థనలు, ఆలయాలు,చర్చీలు,మసీదులలో ప్రత్యే పూజలు చేశారు. అంతే కాదు సముద్రంలోకి వెళ్లి మరీ పార్టీ పేరును , జెండాను ఓ పడవ నుంచి ఆవిష్కరించారు. నీలం, తెలుపు, ఎరుపు వర్ణాలతో మధ్యలో చిహ్నం చేతిలో వేల్ ఉన్నట్టుగా జెండాను తీర్చిదిద్దారు. 2026 ఎన్నికలలో పుదుచ్చేరిలోని అన్ని నియోజకవర్గాలలో తన పార్టీ పోటీ చేస్తుందని జోష్ చార్లెస్ ప్రకటించారు.


