ఉదయనిధిపై పొగడ్తల వర్షం
సాక్షి, చైన్నె: డీఎంకే వారసుడిగా ఉదయనిధి స్టాలిన్‌ను అంగీకరించే విధంగా ఆదివారం తిరువణ్ణామలై వేదికగా సీనియర్ నేతలు సైతం పొగడ్తల వర్షం కురిపించారు. డీఎంకే భవిష్యత్ వారసుడిని అందలం ఎక్కించే విధంగా యువజనోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. సీనియర్ నేతలే కాదు, డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సైతం తన వారసుడి పనితీరును పొగడ్తలతో ముంచెత్తారు. వివరాలు.. డీఎంకే యువజన విభాగం ఉత్తర డివిజన్ మహానాడు ఆదివారం తిరువణ్ణామలై వేదికగా జరిగింది. 91 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన ఈ డివిజన్ పరిధి నుంచి లక్షన్నరకు పైగా యువజనులు వేడుకకు తరలి వచ్చారు. డీఎంకే రాజకీయాల్లో ఈ వేడుక కీలకంగా మారడంతో అందరిచూపు తిరువణ్ణామలై వైపు మరలింది. డీఎంకే వారసుడు స్టాలిన్ తనయుడైన ఉదయనిధి స్టాలిన్ అన్నది జగమెరిగిన సత్యం. ఇందుకు బలాన్ని చేకూర్చే విధంగా ఈ మహానాడు వేదికగా మారింది. సీనియర్ నేతలు దురైమురుగన్, పొన్ముడి, కేఎన్ నెహ్రూ, ఎ. రాజా వంటి నేతలు తమ భవిష్యత్ ఉదయనిధి అని నిర్మోహమాటంగా ఈ వేదికపై స్పష్టం చేశారు. ఉదయం నుంచి లక్ష మందికిపైగా శాఖాహారం, మాంసాహార విందుతో కార్యక్రమం మొదలైంది. కట్టుదిట్టమైన ఆంక్షలు, భద్రత నడుమ కేడర్‌నులోనికి అనుమతించారు. అందరికి టీ షర్టులు, వాటర్ బాటిళ్లు తిను బండారాలతో కూడిన కిట్లను అందజేశారు. సమావేశంలో ప్రసంగించిన నేతలందరూ ఉదయనిధి డీఎంకే భవిష్యత్తు వారసుడు అని చాటే విధంగా పరోక్ష వ్యాఖ్యలను చేశారు. దురైమురుగన్ ఉదయ నిధిని భవిష్యత్ డీఎంకే సాఽరథి అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. రాజా అయితే, భవిష్యత్ తలైవర్ అని సంబోధించడం గమనార్హం. ఈ వేదికలో సీఎం స్టాలిన్‌ను ఘనంగా సత్కరించారు. వెండి సింహానంపై యువజనులు ఆయన్ని కూర్చోబెట్టి సత్కరించడం విశేషం.
యువరక్తానికి ప్రోత్సాహం
డీఎంకేలో యువజన ఆవిర్భావం, దాని అభ్యున్నతికి తాను చేసిన కృషిని మహానాడు వేదికగా స్టాలిన్ గుర్తు చేశారు. డీఎంకే అంటే ఫైర్ బ్రాండ్ అని పేర్కొంటూ గత అనుభవాలను గుర్తుచేశారు. యువజన విభాగాన్ని తాజాగా ఉదయనిధితో పాటూ ఇక్కడున్న యువతకు అప్పగించినట్టు ప్రకటించారు. సిద్ధాంత పరమైన శత్రువులు అయితే, ఉదయనిధి మోస్ట్ డెంజర్ అని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పార్టీకి ఏం కావాలో అన్నది ఆయన లక్ష్యం, అందుకు అనుగుణంగా లక్షలాది మంది యువతని పార్టీలో చేర్పించారని, ఈ కొత్త తరానికి అనుగుణంగా యువజన నేత అడుగులు వేస్తున్నారని కొనియడారు. రానున్న ఎన్నికల ద్వారా యువజన విభాగం డీఎంకే కోసం అహర్నిశలు శ్రమించాలని కోరారు. గత పాలకుల వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్లండి, వాళ్లుమళ్లీ వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ప్రజలకు వివరించాలని యువజనులకు పిలుపునిచ్చారు. ఉదయనిధి ప్రసంగించే క్రమంలో ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారని, ఇందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని అన్నాడీఎంకే వర్గాలు ఇప్పుడేమో ఉత్తములుగా వ్యాఖ్యలు చేస్తున్నారని, తమిళనాడుకు నిరంతర ద్రోహం చేసే బీజేపీ వర్గాలు మరింతగా ప్రోత్సాహకాలు ఇస్తామని నమ్మ బలుకుతారని, ఇవన్నీ తమిళనాడును అపహరించేందుకే అని తమిళ ప్రజలలోకి యువజనులు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. డీఎంకే విజయ ప్రయాణాన్ని ఈ రోజు నుంచి మొదలెట్టాలని, మళ్లీ అధికారం దిశగా శ్రమిద్దామని పిలుపునిచ్చారు.
ఉదయనిధిపై పొగడ్తల వర్షం


